ప్రతి గ్రామంలో 2024 నాటికి అన్ని ఇళ్లకు సురక్షిత మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో అమలవుతున్న జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్థాయి నీరు, పారిశుద్ధ్య కమిటీలు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జెడ్‌పీ సమావేశ మందిరంలో జల్ జీవన్ మిషన్‌పై ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఏజెన్సీ (ఐఎస్ఏ) ప్రతినిధులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించి.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం జల్ జీవన్ మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలను ప్రోత్సహించి, వారికి అవగాహన కల్పించి భాగస్వాములను చేసి మిషన్ విజయవంతానికి మద్దతు సంస్థలు, అధికారులు సమన్వయంలో పనిచేయాలని సూచించారు.
వివిధ పథకాలను విజయవంతం చేయడంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడూ ముందుంటోందని.. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమల్లోనూ జిల్లా ముందుండేలా కృషిచేయాలని సీఈవో సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి సరఫరా పథకం కోసం గ్రామీణ కార్యాచరణ ప్రణాళిక (వీఏపీ)ను రూపొందించడం, నీటి సరఫరా పథకాలను సమర్థవంతంగా నిర్వహించడం, యాజమాన్యీకరించడం, అమలు చేయడం వంటి వాటిలో గ్రామ నీరు, పారిశుద్ధ్య కమిటీలు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామ అవసరాలు, వనరుల సమీకరణ, ప్రజా భాగస్వామ్యం, హర్ ఘర్ జల్ గ్రామాలుగా ప్రకటన తదితర విషయాలపై సపోర్ట్ ఏజెన్సీలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఏజెన్సీ రాష్ట్ర సమన్వయకర్త వీరాస్వామి.. వర్క్‌షాప్‌లో మిషన్ లక్ష్యాలు, గ్రామ నీరు, పారిశుద్ధ్య కమిటీల కూర్పు, బాధ్యతలు; గ్రామస్థాయి ప్రణాళికలు, నీటి నాణ్యత పరీక్షలు, పర్యవేక్షణ, ప్రజా భాగస్వామ్యం తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వి.గిరి, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, ఎన్‌జీవోల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.