శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 8న ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలో జరగనున్న డీ – వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో పి.హెచ్.సి.,సి.హెచ్.సి వైద్యాధికారులతో డీ-వార్మింగ్ డే మరియు ఫీవర్ సర్వే, వైద్యాధికారుల సేవలు తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 8న జరగనున్న డీ – వార్మింగ్ డేను జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. డీ-వార్మింగ్ మాత్రలు ముందుగానే ప్రతి గ్రామ సచివాలయానికి సంబంధిత ఏఎన్ఎంల ద్వారా చేరవేసి, ప్రతి పిల్లవాడితో పాటు 19 ఏళ్ల వయస్సులోపు గల వారందరికీ అందేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
పి.హెచ్.సిలకు కేటాయించిన లక్ష్యాలను సాధించని కొరిగాం, నిమ్మాడ. తాడివలస, గుప్పిడిపేట. సైరిగాం, జి.సిగడాం వైద్యాధికారులు ఇకపై వెనుకంజలో ఉండరాదని, వెనుకంజలో ఉన్నవారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పి.హెచ్.సి వైద్యాధికారులు తమకు అప్పగించిన లక్ష్యాలను తూ.చ తప్పకుండా శతశాతం సాధించాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రతి రోజూ ఉదయం 09.00గం.ల నుండి సాయంత్రం 04.00గం.ల వరకు పి.హెచ్.సి వైద్యాధికారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు.
బయోమెట్రిక్ తప్పనిసరి అని, లేనివారిపై చర్యలు తీసుకుంటామని ఉద్భోదించారు. ప్రతి బిడ్డకు, గర్భిణీ స్త్రీలకు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందేటట్లుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆశావర్కర్, ఏఎన్ఎం ఖచ్చితంగా ఫీవర్ సర్వే చేయాలని, సర్వేలో జ్వరం లేదా టి.బి కేసులు ఉన్నట్లయితే వారికి దగ్గరలోని ప్రాథమిక లేదా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు. విలేజ్ క్లినిక్ లో పనిచేస్తున్నఎం.సి.హెచ్.పిలు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషిచేయాలన్నారు. ప్రతి పి.హెచ్.సిలో ఎల్.టిలు క్షయ వ్యాధి కేసులను గుర్తించి, వారికి కెల్ల పరీక్షలు నిర్వహించి నిర్ధారించిన పిదప వారిని క్షయవ్యాధి నివారణ కేంద్రానికి తరలించాలని సూచించారు. ప్రతి పి.హెచ్.సిలో అన్నిరకాల మందులు నిల్వ ఉండేటట్లు చూసుకోవాలని, మందుల కోసం సంబంధిత ప్రోగ్రామ్ అధికారుల ద్వారా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి పొందాలని తెలిపారు.
మందుల అవసరాలను బట్టి ఎప్పటికపుడు మందులు తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని, డి.ఐ.ఓ విభాగం నుండి సిరంజీలు, కాటన్ పొందాలన్నారు. గర్భిణీ స్త్రీల నుండి పుట్టబోయే బిడ్డ వరకు ప్రభుత్వం అందిస్తున్నపథకాలను అందించాలని, అలాగే వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో సేవలు పొందుతున్న గర్భిణీలు, పిల్లలకు తప్పనిసరిగా గుర్తింపు నెంబరును కేటాయించాలని, పొగాకు, గుట్కా వంటి వాటిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏ.ఎన్.ఎంలకు ట్యాబులు వచ్చాయని, వాటిని సెప్టెంబర్ 12,13వ తేదీల్లో పంపిణీచేయనున్నట్లు చెప్పారు. వాటి సహాయంతో ప్రతి ఏఎన్ఎం అభయ ఐ.డిని కేటాయించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.ఎన్.అనూరాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఆర్.వి.ఎస్.కుమార్, పి.ఓ.డి.టి జె.కృష్ణమోహన్, పరిపాలన అధికారి సువర్ణ, డి.ఎం.ఓ సత్యనారాయణ, డి.పి.ఎం.ఓ వి.వి.అప్పలనాయుడు, జిల్లా మాస్ మీడియా అధికారి పి.వెంకటరమణ, పి.హెచ్.సి, సి.హెచ్.సిల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.