పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారాసీజనల్‌వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్ కె.రమేష్ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన కరణంగారి జంక్షన్, కృష్ణానగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. వర్షాకాలం దృష్ట్యా డెంగీ వంటి వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా వర్షపునీరు, స్వచ్ఛమైన నీటిలో డెంగీ దోమ వృద్ధి చెంది వాటి ద్వారా ప్రజలు అనారోగ్యాలపాలయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ చేపట్టే ప్రత్యేక పారిశుద్ధ్యకార్యక్రమాలతోపాటు ప్రజలు కూడా తమతమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వనీటిని తొలగించుకోవడంపై దృష్టిసారించాలన్నారు.
ముఖ్యంగా పూలకుండీలు, వాడిపడేసిన కొబ్బరి బొండాలు,టైర్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని వ్యాధులు ప్రభలకుండా చూసుకోవాలని కమిషనర్ కోరారు. అలాగే పారిశుద్ధ్య పనులను కూడా ఆయన తనిఖీ చేశారు. ప్రజలు తడిపొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చి పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ పృద్విచరణ్ తదితరులు ఉన్నారు.