సకల విఘ్నాలను తొలగించి, ప్రజలను ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని విజయ నగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. ఆ గణనాథుడి దయతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆమె ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బుద్దికి, జ్ఞానానికి ప్రతీకగా ఆ గణనాథుడిని ఆరాధిస్తారని చెప్పారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి ఎన్నో సుగుణాలను ఈ పండుగ మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. హిందువుల తొలి పండుగ అయిన ఈ గణేష్ చతుర్ధిని ప్రజలంతా భక్తిశ్రద్దలతో నిర్వహించుకోవాలని కోరారు. పందిళ్లలో, మంటపాల్లో వినాయక ఉత్సవాలను నిర్వహించే చోట, తగిన ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని, నిబంధనలను పాటిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలను నిర్వహించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వినాయక నిమజ్జనాలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.