మత్స్యకారుల్లోని ఔత్సాహిక యువత ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ సమీకృత ఇరిగేషన్, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ 2022-23లో భాగంగా స్థానిక నెహ్రు యువ కేంద్రం ఆవరణలో మత్స్య శాఖ ఉద్యోగులకు మత్స్య కార్యకలాపాలపై అవగాహనా కార్యక్రమం సపోర్టింగ్ ఆర్గనైజేషన్ IRPWA ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి మాట్లాడుతూ, మత్స్య శాఖ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వంచే అందజేయబడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు, రైతులకు, మత్స్యకార సంఘాల సభ్యులకు, ఔత్సాహికులకు ఆ పథకాలను వివరించాలన్నారు. తద్వారా ఔత్సాహిక యువత ముందుకు రావడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఫిష్ ఆంధ్ర షాపుల నిర్వహణ ద్వారా స్థానికంగా చేపల వినియోగం పెంచి తద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, మత్స్యకారులు జీవన ప్రమాణాల అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఈ ఫిష్ ఆంధ్ర షాపుల ఏర్పాటుకి ముందుకొస్తే మహిళలు, ఎస్.సి, ఎస్.టి లకు 60%, ఇతరులకు 40% రాయితీని ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. అలాగే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా సబ్సిడీతో కూడిన పధకాలు అందజేస్తుందన్నారు. వాటిలో ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాలు, ఫిష్ వెండింగ్ యూనిట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లు, ఫిష్ కియాస్కులు తదితర పథకాలకు సత్వరమే లబ్దిదారులను గుర్తించి, ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేయించాల్సిందిగా ఆదేశించారు.
మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని డిడి వివరించారు. అంతేకాకుండా వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ. 10.00 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందిస్తుందన్నారు. మత్స్యకారులంతా ఈ-శ్రమ్ లో నమోదు చేశుకుంటే అదనంగా మరో రూ. 2. 00 లక్షలు లభిస్తాయని తెలియజేశారు. పథకాలకు వ్యాపార పెట్టుబడి నిమిత్తం అత్యంత తక్కువ వడ్డీ రేటుతో కిషాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నవిషయాన్ని మత్స్యకారులకు తెలియజేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటినా అర్హుడైన ప్రతీ మత్స్యకారుని నెలకు రూ. 2,500/- పెన్షన్ ను, స్వదేశీ మత్స్యకారులకు నామమాత్రపు లీజుతో చెరువులను కేటాయిస్తారని, అలాగే తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయములో సకాలం లోనే రూ. 10,000/- నేరుగా వారి ఖాతాకు జమ చేస్తారని చెప్పారు. హెచ్ఎస్డీ ఆయిల్ కార్డుల మంజూరు ద్వారా డీజిల్ పోయించుకొనే సమయంలోనే సబ్సిడీ వర్తింపుని కూడా అమలు చేస్తారన్నారు. ఆక్వా రైతులకు విధ్యుత్ రాయితీలు వస్తాయని తెలియజేశారు.
APSADA చట్టం ద్వారా రూపొందించిన ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా ఎలాంటి ఆలస్యం, అలసత్వం లేకుండా సత్వర ఆక్వా కల్చర్ అనుమతులు, నీరు, మట్టి, మైక్రో బయాలజీ పరీక్షల కోసం ఆక్వా ల్యాబ్ లో సేవలు అందిస్తారని.. మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్దతి(RAS, BIOFLOC) లో చేపల సాగు చేయుట మొదలగు వాటి గూర్చి క్షేత్ర స్థాయిలో పనిచేసే మత్స్య శాఖ అభివృద్ధి అధికారులు, మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు, గ్రామ మత్స్య సహయ కులు వివరంగా వివరించి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో APIIATP, ఏపీడీ రామారావు, IRPWA ఆర్గనైజింగ్ చీఫ్ ప్రకాష్, ఎఫ్డీఓ యు.చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు సంతోష్, వేంకటెష్, ప్రసాద్, గ్రామ మత్స్య సహయ కులు తదితరులు పాల్గొన్నారు.