కాకినాడ జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనువైన ప్రాంతాలను గుర్తించి, వారంలోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వివేకానందహాల్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్సీ), జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) సమావేశాలు జరిగాయి. కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక, ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం అమలుకు అవసరమైన ఇసుక, ఖనిజ ఫౌండేషన్ కింద చేపట్టిన పనుల్లో పురోగతి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీచ్‌ల గుర్తింపునకు సమన్వయ శాఖల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఆరు డిపోల పరిధిలో 2.38 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని.. గ్రామ, వార్డు సచివాలయాలు; ఆర్‌బీకేలు తదితర ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను సరఫరా చేయాలని జేపీ పవర్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు.
అదే విధంగా జిల్లాలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) కింద మంజూరైన పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని సర్వ శిక్షా అభియాన్; రహదారులు, భవనాలు; ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని.. ఈ కార్యకలాపాలతో ప్రత్యక్షంగా (10 కి.మీ. పరిధి), పరోక్షంగా (10-25 కి.మీ. పరిధి) ప్రభావితమవుతున్న గ్రామాలు/ఆవాసాల్లో డీఎంఎఫ్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ. 81 లక్షలతో పలు అంగన్‌వాడీ భవనాల పనులకు, తొండంగి మండలంలో రూ. 19 లక్షలతో అయిదు అభివృద్ధి పనులకు తాజా సమావేశం ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, కాకినాడ ఆర్‌డీవో బీవీ రమణ, మైన్స్ అండ్ జియాలజీ డీడీ ఇ.నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, ఆర్ అండ్ బీ ఎస్ఈ కె.హరిప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.