5నెలల్లోగా నాడు-నేడు పనులు పూర్తికావాలి


Ens Balu
8
Srikakulam
2022-09-01 13:42:48

శ్రీకాకుళం జిల్లాల్లో రెండవ విడత క్రింద జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులన్నీ రానున్న ఐదు మాసాల్లోగా పూర్తిచేసి, వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు-నేడు, టి.ఎం.ఎఫ్, ఎస్.ఎం.ఎఫ్, ఆర్.ఓ ప్లాంట్స్, బ్యాంక్ ఖాతాల ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు-నేడు, టి.ఎం.ఎఫ్ ( టాయిలెట్ మెయింట్ నెన్స్ ఫండ్ ) ఎస్.ఎం.ఎఫ్ ( స్కూల్ మెయింట్ నెన్స్ ఫండ్ ),ఆర్ఓ ప్లాంట్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. కావున నాడు-నేడులో చేపట్టిన పాఠశాలలన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

 పాఠశాలల్లో ఉండే అన్ని మౌలిక వసతులకు అవసరమైన అన్ని సరుకుల కొనుగోలుకు, వాచ్ మెన్ ఏర్పాటుకు ఎస్.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని సూచించారు. అలాగే మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు టి.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని చెప్పారు. రెండవ విడతలో నిర్మిస్తున్న పాఠశాలలకు, కళాశాలలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, పనులు జాప్యం కాకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. నిర్మాణం అనంతరం వాటికి అవసరమైన గ్రీన్ బోర్డ్స్,ఫ్యాన్స్, ఎలక్ట్రిఫికేషన్, తాగునీరు, తదితర అంశాలపై చర్యలు చేపట్టాలని అన్నారు.

నాడు నేడు క్రింద చేపడుతున్న జూనియర్ కళాశాలల్లో పనులు శరవేగంగా పూర్తికావాలని, 10వ తరగతి విద్యార్ధులందరూ రానున్న ఏడాదికి కళాశాలల్లో చేరనున్నందున, వారిని దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తిచేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణాల కోసం మంజూరుచేసే నిధుల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 70 కళాశాలల ప్రిన్సిపాల్స్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఇచ్చారని, ఇది బాధ్యత రాహిత్యంగా గుర్తిస్తామన్నారు. అటువంటి వారందరూ తక్షణమే కరంట్ అకౌంట్ తెరచి శుక్రవారం నాటికి అందజేయాలన్నారు. పరిపాలన పరమైన ఉత్తర్వులు ఇవ్వనివాటికి తక్షణమే ఉత్తర్వులు మంజూరుచేసి పనులు ప్రారంభించాలని అన్నారు. పాఠశాలలకు అవసరమైన ఎలెక్ట్రిఫికేషన్ పనులు పూర్తిచేయాలన్నారు.

5న జరగనున్న గురు పూజోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా జిల్లాస్థాయిలో ఈ వేడుకలను ప్రతి పాఠశాలలో నిర్వహించాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఉంటుందని, ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలను జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలతో సమర్పించాలన్నారు. క్లీన్ ఇండియా కాంపెయిన్ లో భాగంగా సెప్టెంబర్ 1నుండి 15వరకు స్వచ్ఛతా బట్వాడా కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాలని, చివరి రోజున ధ్రువీకరణ పత్రాలు పంపిణీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సమన్వయంతో రోజుకు ఒక కార్యక్రమంతో 15 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు.

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు.జెబికె యాప్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, యాప్ లో ఉండే సాంకేతిక లోపాలను ఇప్పటికే సరిదిద్దామని చెప్పారు. కావున విధిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. రానున్న ఐదు రోజుల్లో ఆయా పాఠశాలలో ఉండే సమస్యలను పరిష్కరించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని, ఈ విషయాన్ని అసోసియేషన్లు, తల్లితండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి వివరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందని, విద్యార్థులు ఎక్కడ ఉన్నప్పటికీ హాజరు వేసుకునే వెసులుబాటు ఉందని, అయితే హాజరు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

8 జిల్లాల్లోని ఏ.పి.మోడల్ స్కూల్స్ లో అవసరమైన టీచర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని చెప్పారు. జె.సిల సహకారంతో అర్హతే ప్రామాణికంగా ఈ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పెండింగులో ఉన్న 12 పాఠశాలలకు గాను ఐదుగురు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల  ఖాతాల్లో నగదు జమ అయినందున పనులు ప్రారంభించినట్లు చెప్పారు. మరో 7గురు ప్రధానోపాధ్యాయులు ఖాతాల్లో  నగదు జమకాబడలేదని వివరించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా.జయప్రకాష్, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.