తిరుమలలో సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ు పరిశీలన..


Ens Balu
1
Tirumala
2020-09-21 18:42:22

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌నకు సంబంధించిన‌ ఏర్పాట్ల‌ను సోమ‌వారం టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి ప‌రిశీలించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 23న గ‌రుడ‌సేవ రోజు ముఖ్య‌మంత్రి శ్రీ‌వారికి ప‌ట్టువ‌ స్త్రాలు స‌మ‌ర్పించేందుకు తిరుమ‌ల‌కు రానున్నారు. ఈ నేప‌థ్యంలో బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి ఆల‌యం వ‌ర‌కు, నాద‌నీరాజ‌నం వేదిక వ‌ద్ద భ‌ద్ర‌త ఇత‌ర ఏర్పాట్లను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. 24న ఉద‌యం 7 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ బిఎస్‌.య‌డ్యూర‌ప్ప నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. వేదిక‌పై భ‌ద్ర‌త‌, అలంక‌ర‌ణ‌, కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సిన తీరుపై చ‌ర్చించారు. అనంత‌రం గోకులం విశ్రాంతి గృహంలోని స‌మావేశ మందిరంలో ఈ అంశంపై అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి టిటిడి అధికారులు, పండితుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో టిటిడి ఎస్ఇ-2  నాగేశ్వ‌ర‌రావు, వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్  కెఎస్ఎస్‌.అవ‌ధాని, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, ఎస్వీబీసీ సిఈవో  సురేష్ కుమార్ ఇతర విభాగాధిప‌తులు పాల్గొన్నారు.