రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో టిడ్కో, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, జగనన్న తోడు కార్యక్రమాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరుపై కలెక్టర్ కృతికా శుక్లా.. సమన్వయ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకుల వారీగా రుణ మంజూరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తిచేసి.. రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు.
ఏపీ టిడ్కో హౌసింగ్‌కు సంబంధించి లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన లబ్ధిదారులకు గృహాలు అప్పగించే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 5,064 లబ్ధిదారులకు గాను 2,534 గృహాలకు రూ. 66.54 కోట్ల రుణాలు అందించడం జరిగిందని.. మిగిలిన గృహాలకు కూడా రుణ మంజూరు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా జగనన్న తోడు కింద సవరించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,995; పట్టణ ప్రాంతాల్లో 5,906 మంది చిరు వ్యాపారులకు రూ. 10 వేలు చొప్పున రుణాలు అందించాల్సి ఉంటుందన్నారు.
అదే విధంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 35 వేల చొప్పున అదనపు ఎస్‌హెచ్‌జీ లింకేజీ బ్యాంకు రుణాల మంజూరును కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మునిసిపల్ కమిషనర్లు.. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ శత శాతం లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, మెప్మా పీడీ బి.ప్రియంవద, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, ఎల్‌డీఎం సీహెచ్ ఎస్‌వీ ప్రసాద్, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డీఎల్‌డీవో పి.నారాయణమూర్తి, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.