డిగ్రీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..ఏయూ విసి
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-21 18:44:16
ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ చివరి సెమిష్టర్ పరీక్షలను సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం పాలక మండలి సమావేశ మందిరం నుంచి ఆన్‌లైన్‌లో ఏయూ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. విద్యార్థుల వెంట పారదర్శకంగా ఉండే మంచి నీళ్ల సీసాను అనుమతించాలని సూచించారు. అనారోగ్య లక్షణాలతో ఉన్న విద్యార్థులకు వేరుగా పరీక్షల నిర్వహణకు వీలుగా పరీక్ష కేంద్రాలలో ప్రత్యేక గదులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాల్స్‌కు పలు సూచనలు చేశారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ మూడవ, ఐదవ సెమిష్టర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కళాశాలల యాజమాన్యాలు దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా తరగతుల నిర్వహణ జరగాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంద్ర బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.శ్రీనివాస రావు, పి.రాజేంద్ర కర్మాకర్, ఆర్.శివ ప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.వి సుధాకర్ రెడ్డి, జె.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.