సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో మత మార్పిడులను అరికట్టేందుకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో రెండో దశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 111 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో శనివారం శ్రీవాణి ట్రస్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1342 ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని, మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం జరిగిందని తెలిపారు. రెండో దశలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో ఆలయాల నిర్మాణం జరుగనుందన్నారు.
వీటిలో శ్రీవారి ఆలయాలు -9, రామాలయాలు -77, హనుమంతుని ఆలయాలు -2, శివాలయాలు - 3, గ్రామదేవతల ఆలయాలు - 20 ఉన్నాయని వివరించారు. మొత్తం 1342 ఆలయాల నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించామని, ప్రతి రెండు నెలలకోసారి ఆలయాల నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నిర్మాణం పూర్తయిన 502 ఆలయాలకు, నిర్మాణం జరుగనున్న 111 ఆలయాలకు భజన సామగ్రి అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. ఈ ఆలయాల్లో అర్చకులుగా నియమించే వారికి శ్వేత ఆధ్వర్యంలో నిత్యపూజా విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో టిటిడి జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సమరసత సేవా ఫౌండేషన్ ఛైర్మన్ తాళ్లూరు విష్ణు, సెక్రటరీ త్రినాథ్, జాయింట్ సెక్రటరీ సునీల్ తదితరులు పాల్గొన్నారు.