పరిశ్రమల్లో కార్మికుల భద్రత, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితరాలకు సంబంధించి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా స్పష్టం చేశారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ కోర్టుహాల్‌లో పరిశ్రమలు, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, విపత్తుల నిర్వహణ తదితర శాఖల అధికారులతో పాటు జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మరణించడం చాలా బాధాకరమని.. ఇకపై జిల్లాలో ఒక్క ప్రమాదం కూడా జరక్కుండా చూడాలన్నారు.
భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనిప్రదేశాలను అత్యంత సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని.. చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి దారితీయొచ్చనే విషయాన్ని గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో జిల్లాలోని అన్ని పారిశ్రామిక యూనిట్లలో సేఫ్టీ ఆడిట్, తనిఖీలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, ఏపీపీసీబీ ఎన్విరాన్‌మెంటల్ ఇంజీనీర్, జిల్లా అగ్నిమాపక అధికారి, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ తదితరులు సభ్యులుగా ఉంటారని వివరించారు. అత్యంత ప్రమాదకర పరిశ్రమలతో ప్రారంభించి.. దశల వారీగా అన్ని పరిశ్రమల్లోనూ తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
చెక్ లిస్ట్‌ల ప్రకారం విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రతా వ్యవస్థల పనితీరుపై నిరంతర అప్రమత్తత, పర్యవేక్షణ అవసరమని.. ఆ దిశగా పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత పారదర్శకంగా భద్రత, పర్యావరణ హిత చర్యలపై ఆడిట్ జరగనుందని వెల్లడించారు. ఇంటర్ లాకింగ్, అలారమ్ వంటి వ్యవస్థలను ఆధునికీకరించుకోవాల్సిన అవసరముందన్నారు. పరిశ్రమల్లో వివిధ విభాగాల్లో పనిచేసేందుకు నిబంధనల మేరకు ఆయా కార్యకలాపాలపై నైపుణ్యమున్న వారిని మాత్రమే నియమించుకోవాలని స్పష్టం చేశారు. కార్మికుల భద్రతతో పాటు సంక్షేమానికి సంబంధించి అన్ని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.లక్ష్మీనరసయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్.అశోక్, పరిశ్రమల శాఖ ఏడీ కె.కృష్ణార్జున రావు, జిల్లా అదనపు అగ్నిమాపక శాఖ అధికారి బి.యేసుబాసు, జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.