ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక సరఫరా లో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లాలో ఇసుక నిల్వలు, సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనబడి నాడు-నేడు, జగనన్న కాలనీలు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు ఆటంకం కలగని విధంగా ఎప్పటికప్పుడు ఇసుక సరఫరా చేయాలని జెపి పవర్ వెంచర్స్ ప్రతినిధిని ఆదేశించారు. ఏ రోజు ఎంత మొత్తంలో ఇసుక అవసరం ఉందో ముందుగానే అంచనావేసి మైన్స్ శాఖ ఎడి ద్వారా ఇసుక సరఫరా కంపెనీకి తెలియజేయాలన్నారు. అలాగే భీమవరం, నరసాపురంలలో కొత్తగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో సిద్ధాంతం, నడిపూడి, కరుగోరుమిల్లి కోడేరులలో నాలుగు ఓపెన్ రీచ్ లు ఉన్నాయని, బోట్స్ మెన్ సొసైటీలు 11 ఉన్నాయని, ప్రస్తుతం మూడు యలమంచిలి లంక, అబ్బిరాజుపాలెం, చించినాడ బోట్స్ మెన్ సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. వరద నీటి కారణంగా 4 ఓపెన్ రీచులు , 8 బోట్స్ మెన్ వినియోగంలో లేవని తెలిపారు. మనబడి నాడు-నేడు కింద 1,200 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాకు అర్బన్ పీహెచ్ సిలు మంజూరయ్యాయని, త్వరలో వాటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలం రాకముందే ఎక్కువ మొత్తంలో ఇసుకను ఎందుకు డంప్ చేసుకోలేదని జెపి ప్రతినిధిని కలెక్టర్ ప్రశ్నించారు.
ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జెపి ప్రతినిధిని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి.మురళీ, ఇన్చార్జ్ డిఆర్ఓ దాసిరాజు, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ కుమారి డి. అఖిల, మైన్స్ శాఖ ఏడి సుబ్రమణ్యం, జిల్లా వాటర్ రిసోర్స్ అధికారి పి. నాగార్జున రావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కెఎస్ఎస్. శ్రీనివాస రావు, హౌసింగ్ పీడీ ఎ.వి. రామరాజు, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ కె.డి. ఆనంద్, జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీసర్ అర్.విజయ్ పాల్గొన్నారు.