మెరిట్ ఆధారంగానే వైద్యశాఖ పోస్టుల భర్తీ జరుగుతుందని విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా సెలెక్షన్ కమిటి చైర్మన్ ఎ.సూర్య కుమారి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నియామకాలు అన్నీ ప్రభుత్వ నియమ నిబంధనుల మేరకు, అత్యంత పారదర్శకంగా, రోస్టర్ ప్రకారం జరుగుతాయని, ఏ ఒక్క అభ్యర్ధి కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని, వదంతులు నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. అభ్యర్ధులు వివిధ కేటగిరీల పోస్టులకు దరఖాస్తు చేసినప్పటికీ, కౌన్సిలింగ్ రోజున ఎంపిక కాబడిన పోస్టు లోనే నియామకం చేయడం జరుగుతుందన్నారు. వైద్యారోగ్యశాఖ, వైద్య విధానపరిషత్, మెడికల్ కళాశాల, బోధనాసుపత్రిలలో దేనికి ఎంపిక అయితే, ఆ విభాగం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని, విభాగాల్లో ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసారు.
ఈ నోటిఫికేషన్‌లో జారీ చేసిన 194 పోస్టుల్లో ఎక్కడైనా, ఏడాది లోపల ఖాళీలు ఏర్పడితే, ఆ మెరిట్ జాబితాను నుంచి మాత్రమే భర్తీ చేయడం జరుగుతుందని, వేరేగా నోటిఫికేషన్ ఇవ్వడం జరగదని తెలిపారు. కౌన్సిలింగ్ అనంతరం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని, తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించినచో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యంజిల్లాల్లో వైద్య శాఖకు సంబంధించిన వివిధ కేటగిరీలలో 194 కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పోస్టులకు ఆగష్టు 29 నాటికీ ఉన్న ఖాళీలతో రోస్టర్ వారీగా నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ , వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీ, బోధనా ఆసుపత్రి పరిధిలో పనిచేయడానికి ఈ భర్తీ ప్రక్రియను చేపట్టినట్టు వివరించారు.
కోర్టు కేసు కారణంగా మెడికల్ రికార్డు టెక్నీషియన్ పోస్టులు రెండు మినహా, 192 పోస్టులకు ప్రస్తుతం భర్తీ ప్రక్రియను చేపట్టినట్టు తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ 13, ఎపి వైద్య విధాన పరిషత్ 29, మెడికల్ కాలేజ్ 42, బోధనాసుపత్రి లో 110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వివరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసినవారి ప్రొవిజనల్ జాబితాను, పోస్టులు, రోస్టర్ , రిజర్వేషన్ తదితర వివరాలను ఆన్ లైన్ లో http://vizianagaram.ap.gov.in (or) http://vizianagaram.nic.in“ నందు పొందుపరచడం జరిగిందని తెలిపారు. దీనికి సంబందించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లు అయితే పూర్తి ఆధారాలతో, సర్వీసు సర్టిఫికేట్ ఉన్నవారు, తమ సర్టిఫికేట్ అసలు కాపీని నియామక అధికారితో కౌంటరు సిగ్నేచర్ చేస్తూ, నియామక ఉత్తర్వులు కూడా జత చేసి గెజిటెడ్ ఆఫీసరు వారితో ధ్రువీకరణ చేయించి నేరుగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారి కార్యాలయమునకు ఈ నెల 6 వ తేదీ సాయంత్రం 5.గ.ల లోపు తమ గ్రీవెన్స్ సమర్పించ వలసి ఉంటుందని తెలిపారు.
.........................
ఉమ్మడి జిల్లాలో మొత్తం పోస్టులు ః 194
జిల్లా వైద్యారోగ్యశాఖ ః 13
ఎపి వైద్య విధాన పరిషత్ ః 29
మెడికల్ కాలేజ్ ః 42
బోధనాసుపత్రి ః 110