అపోలోకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది


Ens Balu
8
Tirupati
2022-09-05 06:40:16

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆసుపత్రి) అపోలో ఆసుపత్రికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వైద్య సేవలు అందిస్తోందని అపోలో ఆసుపత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. కుటుంబ సమేతంగా సోమవారం ఆయన శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిని సందర్శించారు.. జనరల్ వార్డు, ఐసియూ లు, ఆపరేషన్ థియేటర్లు, క్యాత్ ల్యాబ్ విభాగాలను పరిశీలించారు. అక్కడి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే 600 మందికి పైగా చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవోఎ వి ధర్మారెడ్డి డాక్టర్ ప్రతాప్ రెడ్డికి వివరించారు. బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాల నుంచి కూడా తల్లి తండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి ఆపరేషన్లు చేయించుకుని వెళ్లారని ఆయన తెలిపారు. త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

          అనంతరం డాక్టర్ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లల హృదయాలయంలో శుభ్రత, ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించే చర్యలు, వైద్య సేవలు, సర్జరీలు చేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది ఆత్మ విశ్వాసం ఎంతో గొప్పగా ఉన్నాయన్నారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే  600 మంది చిన్నారులకు డాక్టర్లు పునర్జన్మ ఇచ్చారని అభినందించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమయ్యే యంత్ర సామగ్రి మొత్తం తమ కుటుంబం విరాళంగా అందిస్తుందని ప్రకటించారు. అలాగే అపోలో ఆసుపత్రుల నుంచి డాక్టర్లు ఇక్కడికొచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. విదేశాల్లో తమ ఆసుపత్రులకు సాంకేతిక, వైద్య సహకారం అందిస్తున్న పేరొందిన చిన్న పిల్లల ఆసుపత్రుల సేవలు కూడా అందేలా ఏర్పాటు చేస్తానని డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 

ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తనకు ఇచ్చిన గొప్ప  అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో టీటీడీ ప్రజల కోసం ఎంతో గొప్ప సేవలు అందించిందని ఆయన అభినందించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి క్యాత్ ల్యాబ్ నిర్వహణ, ఆపరేషన్లు చేసేందుకు పాటిస్తున్న  విధానాలను డాక్టర్ ప్రతాప్ రెడ్డి కి వివరించారు.