క్రీడాభివ్రుద్ధి పనుల త్వరగా పూర్తిచేయాలి..
Ens Balu
3
Vizianagaram
2020-09-21 19:10:12
విజయనగరం జిల్లా కేంద్రంలో జరుగుతున్న క్రీడాభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. విజయనగరం పట్టణంలో జరుగుతున్న క్రీడలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలను ఆయన సోమవారం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండోర్ స్టేడియంను సందర్శించి, ఇక్కడ సుమారు రూ.6కోట్లతో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ రూ.6కోట్లలో రూ.3కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులని, రూ.25లక్షలు ఎంపి లేండ్స్ కాగా, రూ.75లక్షలు రాష్ట్ర క్రీడాభివృద్ది సంస్థ మంజూరు చేసిందని జిల్లా క్రీడాభివృద్ది అధికారి ఎస్.వెంకటేశ్వర్రావు జెసికి వివరించారు. మిగిలిన రూ.2కోట్లను విఎంఆర్‌డిఏ మంజూరు చేసిందన్నారు. పనులన్నిటీనీ త్వరగా పూర్తి చేసి, స్టేడియంను అన్ని వసతులతో సిద్దం చేయాలని జెసి ఆదేశించారు. అనంతరం విజ్జీ స్టేడియంను జెసి సందర్శించారు. ఇక్కడ నిర్మితమవుతున్న స్పోర్ట్స్ స్కూలు భవనాలను పరిశీలించారు. స్పోర్ట్స్ స్కూలును రూ.20కోట్లతో ప్రతిపాదించడం జరిగిందని, ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.60లక్షలు మంజూరు చేసిందని డిఎస్‌డిఓ తెలిపారు. ఈ నిధులతో పరిపాలనా భవనాన్ని, డార్మెటరీలను నిర్మించినట్లు తెలిపారు. వాటిని త్వరగా పూర్తిచేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీవాలని జెసి అన్నారు. అటవీశాఖ భూమిని వేరుచేస్తూ కంచెను నిర్మించాలని సూచించారు. అలాగే విజ్జీ స్టేడియం సుమారు 70 ఎకరాల్లో విస్తరించి ఉండాలని, మరోసారి పూర్తిగా సర్వే చేయించి, విస్తీర్ణాన్ని ఖరారు చేయాలని జెసి ఆదేశించారు. ఈ పర్యటనలో జెసి వెంట డిఎస్డిఓతోపాటుగా, ఎపి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణరాజు, గణేష్ తదితరులు ఉన్నారు.