ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకూడదు


Ens Balu
53
Visakhapatnam
2022-09-06 11:41:07

విశాఖజిల్లాలో ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితులలో  అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగులపై ఉందని జిల్లా కలక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  అన్నారు.  మంగళవారం జిల్లా కలక్టర్ కార్యాలయంలో  నిర్వహించిన  రెవెన్యూ అధికారుల వర్క్ షాప్ లో  జిల్లా కలక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యు అధికారులు నూతన చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకొని, సాంకేతికత  పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మంచి ఫలితాలు సాధించాలన్నారు.   ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలిసిన వెంటనే  సర్వేయర్, రెవెన్యూ అధికారులు సంబంధిత భూ కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.  అవసరమైతే   జాయింట్ కలక్టర్, రెవెన్యూ డివిజన్ అధికార్లు తనిఖీలు నిర్వహించి  ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలన్నారు. 

అదే విదంగా  అన్యాక్రాంతమైన  ప్రభుత్వ భూములను రక్షించిన వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా గెడ్డలు, పోరంబోకు, కాలువలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు. ప్రజలు వారి యొక్క సమస్యలతో కార్యాలయంనకు వచ్చినపుడు వారితో సహనంతో మాట్లాడి వారి యొక్క సమస్యలను తీర్చే విదంగా రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు.  దీర్ఝకాలిక సమస్యలపై దృష్టి సారించాలని, ఒక నిర్ణయం ద్వారా అనేక మంది ప్రజలకు ఉపయోగపడే సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి  పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా  జిల్లాలో  1,40,000 ఇళ్ల స్థల పట్టాలు పంపిణీకి భూసేకరణ మరియు ఇతర పనులకు నిరంతరం శ్రమించిన అధికారులను అభినందించారు.  

త్వరలో ఒకేసారి  సుమారు  లక్ష ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా ప్రారంభించి ముందుకు వెళ్లేందుకు  ప్రతి ఒక్కరూ సన్నద్దం కావాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అధికారులందరూ ముందుగా రావాలన్నారు.  త్వరలో  ఒక మండలంను ఒక యూనిట్ గా జిల్లా కలక్టర్ తో పాటు జిల్లా అధికారులందరూ  రాత్రి బస చేసి ఆ మండలంలో నున్న అన్ని కార్యాలయాలతో పాటు చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు వారంలో మూడు రోజుల పాటు క్షేత్ర పరిశీలన చేయాలని సదరు వివరాలను కలక్టర్ కు తెలపాలన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ కె.యస్.విశ్వాథన్, డి.ఆర్.ఓ శ్రీనివాసమూర్తి, విశాఖపట్నం, భీమిలి ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటి తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.