కాకినాడ రూరల్, వలసపాలక లోని కేంద్రీయ విద్యాలయంలో అస్వస్థతకు లోనైన విద్యార్థులందరూ కోలుకుని, నిలకడైన ఆరోగ్యంతో సురక్షితంగా ఉన్నారని కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. మంగళవారం ఉదయం కాకినాడ రూరల్ మండలం వలసపాకల లోని కేంద్రీయ విద్యాలయంలో 5, 6 తరగతులు చదువుతున్న 18 మంది విద్యార్థులు ఊపిరి ఆడక పోవడం, ఛాతీలో మంట లక్షణాలతో కూడి అస్వస్థతకు లోను కావడంతో, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై వారందరినీ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి హుటాహుటిన తరలించి వైద్య సహాయం అందించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, కాకినాడ ఎంపి వంగా గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు,సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని, వారందరూ పూర్తి స్వస్థత పొందేవరకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హాజరైన మీడియాతో జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9-30 గంటలకు తరగతులకు హాజరైన 5, 6, 7 తరగతుల విద్యార్థులు తమకు ఊపిరి ఆడటం లేదని, గుండెల్లో మంటగా ఉందని తెలియజేయడంతో వారందరినీ ఉపాధ్యాయులు ఆరుబయట వెంటిలేటెడ్ ప్రదేశానికి తరలించారని, తీవ్ర అస్వస్థతకు లోనైన 18 మంది వెంటనే 108 ఆంబులెన్స్ లలో కాకినాడ జిజిహెచ్ కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించడం జరిగిందన్నారు. 5వ తరగతి విద్యార్థులు ముగ్గురు, 6వ తరగతి విద్యార్థులు ఎనిమిది మంది, 7వ తరగతి విద్యార్థులు ఏడుగురు ఈ అస్వస్థతకు గురైయ్యారన్నారు.
చికిత్స పొందుతున్న 18 మంది తిరిగ కోలుకున్నారని, వారి ఆరోగ్యానికి ఎటువంటి భయం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. అందరి బిపి, ఆక్సిజన్ లెవల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారన్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణాలు ఇంకా ఇదమిద్దంగా నిర్థారణ కాలేదని, సమాచార అందిన వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫాక్టరీస్, అగ్నిమాపక అధికారులను కేంద్రీయ విద్యాలయానికి పంపి ప్రాధమిక విచారణ నిర్వహించడం జరిగందని, తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాల్లో ఎటువంటి రసాయినిక, విష వాయువుల ఉనికి లేదని విచారణ బృంద తెలిపిందన్నారు. పాఠశాల పరిశ్రమలకు దూరంగా, జన నివాసాల మద్యలో ఉందని, ఆ ప్రాంతంలో కలుషిత వాయువు ప్రభావం ఉన్నట్లు పరిసర ప్రజలెవరూ తెలిజేయలేదన్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణాలను నిర్థారించేందుకు వైద్యులు, ఫుడ్ కంట్రోలర్, ప్యాక్టరీస్, పొల్యూషన్ బోర్డు అధికారులు సభ్యులుగా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, 24 గంటలలో నివేదిక అందజేయాలని ఈ కమిటీని కోరామన్నారు. అలాగే విద్యార్థుల బ్లడ్ శాంపిళ్లను, పాఠశాలలోని త్రాగునీరు శాంపిళ్లను లాబొరేటరీకి పంపామని, ఈ పరీక్షలలో వారి అస్వస్థతకు కారణాలను విశ్లేషించడం జరుగుతుందన్నారు.
కాకినాడ ఎంపి వంగా గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ విద్యార్థుల అస్వస్థత సమాచరం అందిన వెంటనే జిల్లా యంత్రాంగ తక్షణం స్పందించి వైద్య సహాయం అందించిందన్నారు. అలాగే కొంత మంది ప్రచారం చేస్తున్న వందంతులను నమ్మి ఆందోళనకు గురి కాకుండా దైర్యంగా ఉండి వైద్య సేవలకు తల్లిదండ్రులు సహకరించారన్నారు. భగవంతుడు దయ వల్ల విద్యార్థులు అందరూ క్షేమంగా కొలుకున్నారని, శాంపిల్ పరిక్షలు, విచారణ కమిటీ పరిశీలనలో ఈ సంఘటనకు కారణాలు నిర్థారణ అవుతాయన్నారు. పిల్లలు పూర్తిగా కోలుకుని, తల్లిదండ్రులు సంతృప్తి చెందే వరకూ జిజిహెచ్ లో ప్రత్యక వార్డులో ఉంచి వైద్య పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందన్నారు. కేంద్రీయ విద్యాలయం ప్రస్తుతం కాకినాడ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించడం జరుగుతోందని, త్వరలోనే పండూరు సమీపంలోని పి.వెంకటాపురంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలు నిర్మించ నున్నామని ఎంపి తెలియజేశారు. ఇందుకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేశామని, త్వరలోనే భూమి స్వాధీనం చేసుకుని పనులు 15 నుండి 20 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించ నున్నట్లు నిన్ననే కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ లోని కేంద్రీయ విద్యాలయ కమీషనరేట్ నుండి తనకు తెలియజేశారని ఎంపి తెలిపారు. ఈ లోపున ప్రస్తుతం విద్యాలయం నడుస్తున్న కాకినాడ పబ్లిక్ స్కూల్లో తరగతి గదుల ఇబ్బంది లేకుండా అదనపు తరగతి గదులు కూడా నిర్మిస్తామని తెలిపారు.