కాకినాడ గ్రామీణ మండలం వలసపాకల గ్రామంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల అస్వస్థతకు కారణం విషవాయువులు కాదని.. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీల నుంచి విషవాయువు ఎక్కడ విడుదల కాలేదని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు తెలిపారు. ఈ సంఘటనలో మంగళవారం ఉదయం నుంచి కేవలం భయాందోళనలు సృష్టించేందుకు కొంత మంది చేస్తున్న రకరకాల వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని ప్రాథమికంగా విచారణలో తేలిందన్నారు. 418 విద్యార్థులు ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కేవలం ఆరు, ఏడు తరగతులలో ఉన్న 18 మంది విద్యార్థులకు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని ఆయన తెలిపారు. కాకినాడ గ్రామీణ మండలం వలసపాకల గ్రామంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం పరిశ్రమలకు చాలా దూరంగా ఉందని ముఖ్యంగా సూర్యపేటకు దగ్గర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ సభ్యులు అంతా పరిశీలించి వాస్తవ విషయాన్ని నిర్ధారించడం జరుగుతుందన్నారు. జీజీహెచ్ లో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థులు అందరితో మాట్లాడటం జరిగిందని వీరందరూ కొరకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచడానికి అవసరమైన ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న, కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి.వెంకటబుద్దా, ఆర్ఎంఓ డా.అనిత, డిఎంహెచ్ఓ డా. ఆర్.రమేష్, డిఈఓ డి.సుభద్ర, వైద్యాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.