కాకినాడలో కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకోవడానికి కారణాన్ని కచ్చితంగా తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరక్కుండా చూసుకోవడానికి వీలుపడుతుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా సూచించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో ప్రత్యేక విచారణ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల రక్త నమూనాలు, తాగునీటి నమూనాలను ల్యాబ్‌లకు పంపినందున.. నివేదికలు వస్తే కారణాలను అన్వేషించేందుకు వీలవుతుందన్నారు. అదే విధంగా మైక్రో బయాలజీ నిపుణులను పాఠశాలకు పంపి పరిశీలన చేయించాలని అధికారులకు సూచించారు.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం సంఘటన జరిగిన సమయం వరకు పాఠశాల కార్యకలాపాలను ప్రిన్సిపల్ బి.శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో మౌలిక వసతులు, పరిసరాల వాతావరణం, విద్యార్థులు పాల్గొన్న పాఠ్య, సహ పాఠ్య కార్యక్రమాలు, తాగునీటి వ్యవస్థ తదితరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని జీజీహెచ్ వైద్యులు డా. ఎంఎస్ రాజు వివరించారు. పాఠశాలలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌కు సూచించారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆయా విభాగాల పరిశీలనల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో కమిటీ ఇతర సభ్యులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్.అశోక్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ, డీఈవో దాట్ల సుభద్ర, అస్టిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.