నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులకు సూచించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ కోర్టుహాల్‌లో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై కాకినాడ అర్బన్, రూరల్, తుని, తొండంగి మండలాల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లలో నిర్మాణాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించినందున ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. లేఅవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, 90 రోజుల్లో ఇంటి పట్టా కింద అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. లబ్ధిదారులను వారికి కేటాయించిన ప్లాట్లతో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.
అదే విధంగా అవసరమైనచోట భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, వివిధ మండలాల తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు.