భూరికార్డుల స్వచ్చీకరణ త్వరగా చేపట్టాలి..


Ens Balu
2
Srikakulam
2020-09-21 19:38:17

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతీ మండలంలో మూడు గ్రామాలను ఎంపికచేసి భూమి రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాలను వీలైనంత త్వరగా చేపట్టాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూరికార్డుల స్వచ్చీకరణపై సంబంధిత అధికారులతో జె.సి సమీక్షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ ప్రతీ మండలంలో మూడు గ్రామాలను ఎంపికచేసి నిర్ణీత ప్రోఫార్మా – 1 మరియు 2కు సంబంధించి అప్ డేషన్ పూర్తికావాలన్నారు. మూడు గ్రామాల మాన్యువల్ సర్వే భూరికార్డులను తీసుకొని గతంలో చేసిన డేటా ఎంట్రీతో సరిపోల్చాలని, ఏదైనా వ్యత్సాసం ఉంటే వాటిని సరిదిద్దాలని కోరారు. మాన్యువల్ భూరికార్డులో ఉన్న వివరాలు డేటా ఎంట్రీ చేయబడిన సర్వే మరియు భూవివరాలతో సరిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పనిని గ్రామ రెవిన్యూ సెక్రటరీలు, గ్రామ సర్వేయర్లు పూర్తిచేయాలని అనంతరం మండల సర్వేయర్ మరియు తహశీల్ధారు తనిఖీ చేసి మూడు రోజుల్లోగా వాటిని ధృవీకరించాలని వివరించారు. ఈ దశ పూర్తయిన తదుపరి మూడు గ్రామాలకు సంబంధించిన సర్వే మరియు భూరికార్డుల ప్రాప్తికి సిద్ధం చేసుకోవాలని, ప్రతి సర్వే నెంబరు సబ్ డివిజన్ లో గల విస్తీర్ణం మరియు వర్గీకరణ మరోసారి నిర్ధారించుకోవాలని స్పష్టం చేసారు. సర్వే మరియు భూ రికార్డులు గత 60 నుండి 90 ఏళ్ల క్రితం తయారు చేయబడినందున, సర్వే నెంబర్లు, విస్తీర్ణం మరియు వర్గీకరణ వంటి అనేక వివరాలు గణనీయంగా మార్పులు చెంది ఉంటాయన్నారు. కావున భూకమతాలు వారి అజమాయిషీ చేసిన తరువాత మాత్రమే వెబ్ ల్యాండ్ అడంగళ్ ప్రాప్తికి సర్వే మరియు భూ రికార్డుల్లో అవసరమైన వివరాలను నమోదుచేయవలసి ఉంటుందన్నారు. రైతులకు, పట్టాదారులకు సంబంధించిన భూములలో భాగ పంపకములు, క్రయవిక్రయాలు, గిఫ్ట్ లు, పట్టాదారుల మరణాంతరం వారసుల పేరున హక్కులు బదలాయించుట వంటి అనేక కారణాల వలన వెబ్ ల్యాండ్ అడంగళ్ లోని వివరాలు నవీకరించవలసిన అవసరం కూడా ఉంటుందని, భూ సేకరణ , డీపట్టా మంజూరు చేయుట, భూ బదలాయింపు, ఎలిమినేషన్ వంటి ప్రక్రియల ద్వారా భూరికార్డుల్లో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రైతులు, పట్టాదారులు గ్రామ సచివాలయాలు, మీ-సేవా కేంద్రాల ద్వారా అవసరమైన ఇ-పట్టాదారు పాసు పుస్తకాలు, 1బి ప్రతులు, అడంగళ్ కాపీలు దోషరహితంగా పొందే పరిస్థితి వస్తుందని, ఈ లక్ష్యంతోనే సర్వే బృందాలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలపై మండల తహశీల్ధారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఇతర సాంకేతిక కారణాల వలన రైతు భరోసా, వ్యవసాయ ఉత్పాదితాలు, సరఫరా మరియు కనీస మద్ధతు ధర పొందడం విషయంలో ఇబ్బందులు ఉండరాదని జె.సి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, సర్వే మరియు భూరికార్డుల సహాయ సంచాలకులు ఎప్పటికపుడు పర్యవేక్షించి నివేదికను తమకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ యం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, సర్వే మరియు భూరికార్డుల సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, డివిజనల్ ఇన్ స్పెక్టర్ జి.వెంకటరావు, మండల తహశీల్ధారులు,సర్వేయర్లు,వి.ఆర్.ఓలు , గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.