పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆక్వా రైతులు వాతావరణ మార్పులు గమనించాలని జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య కోరారు. అల్పపీడనం కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆక్వా రైతులందరూ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా చెరువులను పరిశీలించాలని ఆయన సూచించారు. వాతావరణంలో మార్పుల వలన ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, పీహెచ్, నీటిలో కరిగే ఆక్సిజన్ (డిజాల్వెడ్ ఆక్సిజన్ - డివో) లలో మార్పులు సంభవిస్తాయని ఆక్వా చెరువు నీటిలో ఉండాల్సిన వివిధ ధాతువుల విలువలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఆయన అన్నారు. ఆల్కలినిటి (కార్బోనేట్స్, బైకార్బోనేట్స్) కొరకు తినే సోడాను ఎకరానికి 10 కేజీలు, పీహెచ్ కొరకు రాక్ లైమ్ ను ఎకరానికి ఒక బస్తా, డివో కొరకు గాలి మరలు (ఏరేటర్స్) ను, పొటాషియం పర్మాంగనేట్ ను, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను, సోడియం ఫెర్బోరేట్ ను అందుబాటులో ఉంచుకోవాలని తిరుపతయ్య విజ్ఞప్తి చేశారు.