అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని, ప్రజలకు సేవలందించే విధంగా ఆపదమిత్రలకు సమర్ధవంతమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ఆపద మిత్రల శిక్షణా కార్యక్రమంపై, కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా విపత్తుల నిర్వహణాధికారి బి.పద్మావతి మాట్లాడుతూ, జిల్లాలో 300 మంది వలంటీర్లను ఆపద మిత్రలుగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. వలంటీర్లతోపాటు ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్లు, సివిల్ ఇంజనీర్లు, అగ్నిమాపక, పోలీసు అధికారులు కూడా వయసుతో సంబంధం లేకుండా ఆపదమిత్రలుగా చేరవచ్చని సూచించారు. వీరికి 12 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఈనెల 16 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు రాకముందు, వచ్చిన సమయంలో, వచ్చిన తరువాతా చేపట్టాల్సిన చర్యలపై నిపుణలతో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు, మానవ తప్పిదాల కారణంగా జరిగే ప్రమాదాలను ఎదుర్కొనే విధానంపైనా శిక్షణ ఉంటుందని తెలిపారు.
జెసి మయూర్ అశోక్ మాట్లాడుతూ, ఆపద మిత్రలు అన్ని రకాల వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. దీనికోసం ప్రతీ ప్రభుత్వ శాఖా, తమతమ శాఖల పరంగా జరిగే విపత్తులను, వాటిని ఎదుర్కొనే విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆపద మిత్రలకు వివరించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న దేశంలోని 352 జిల్లాల్లో మన జిల్లా కూడా ఉందని, అందువల్ల ఈ శిక్షణా కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే విధానంపై మన దేశంలో ప్రజలకు సరైన అవగాహన లేదని, పాశ్చాత్యా దేశాల్లో చిన్నతనంలోనే వీటిని నేర్పిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ, ప్రజలకు వైపరీత్యాలను ఎదుర్కొనడంలో సన్నద్దం చేసేందుకు, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. మండలానికి ఇద్దరు చొప్పున ఆశా కార్యకర్తలను కూడా ఎంపిక చేసి, ఆపదమిత్ర శిక్షణ ఇప్పించాలని జెసి సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్‌పి సిఇఓ ఎం.అశోక్ కుమార్, జిల్లా పంచాయితీ అధికారి ఇందిరా రమణ, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావు, మత్స్యశాఖాధికారి ఎన్.నిర్మలాకుమారి, సెట్విజ్ సిఇఓ రామానందం, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.
.........................................