రైతుల నడ్డివిరవడానికే వ్యవసాయబిల్లు ఆమోదం..


Ens Balu
1
జవిఎంసీ గాంధీ విగ్రహం
2020-09-21 19:56:27

‌రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ బిల్లలను రాజ్యసభలో బిజెపి అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నగర కార్యదర్శి డా. బి.గంగారావ్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయబిల్లుకి  వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ ‌విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‌మాట్లాడుతూ దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున రైతులు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ఎన్డీయే మిత్రపక్షమైన అకాలిదల్‌కు చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేసినా కనీసం వాటిని పరిగణలోనికి తీసుకోకుండా బిల్లులను ఆమోదింపజేసుకోవడం గర్హనీయమన్నారు. ఈ బిల్లు వలన దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు.  వ్యవసాయం మొత్తం కోటీశ్వర్లకు, బడా వ్యాపారులకు, విదేశీ వ్యాపారులపరమౌతుందని అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లును ఓటింగ్‌కు గాని, సెలక్ట్ ‌కమిటీకు గాని పంపించకుండా దొడ్డిదారిని అమలు చేయడం బిజెపి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని అన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసారని విమర్శించారు.తెలంగాణా రాష్ట్రసమితి (టిఆర్‌ఎస్‌)‌తో సహా వివిధ పార్టీలు లోక్‌సభ, రాజ్యసభలోని ఈ బిల్లులను వ్యతిరేకించినా మన రాష్ట్రానికి చెందిన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఈ బిల్లులను సమర్థించడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. మాజీకార్పొరేటర్‌ ‌బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు, జిఎస్‌టి, లాక్‌డౌన్‌ ‌మొదలగు విధానాలతో గత ఆరు సంవత్సరాల నుండి ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ‌బి.జగన్‌, ‌నగర కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు, ఎం.రాంబాబు, ఆర్‌ఎన్‌.‌మాధవి, బి.సూర్యమణి, వి.కృష్ణారావు, ఆర్‌పి.రాజు, డి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.