శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 14వ ఆంధ్ర బెటాలియన్ లో శిక్షణ పొందిన కళాశాల ఎన్.సి.సి విద్యార్థులు 56 మంది అగ్నివీర్ కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.సురేఖ పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఆర్మీ ర్యాలీలో అగ్నివీర్ దేహదారుఢ్య పరీక్ష విభాగంలో ఎంపికైనట్లు ఆమె వివరించారు. వీరందరికీ ఎన్.సి.సిలో సి-సర్టిఫికెట్ ఉండడం వలన వ్రాత పరీక్ష లేకుండానే ఉద్యోగార్దులుగా మారుతారని, సైన్యంలో చేరే అవకాశాన్ని పొందుతారని ఆమె తెలిపారు. అగ్నివీర్ కు ఎంపికైన ఎన్.సి.సి క్యాడెట్లను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని అన్నారు. దేశ సేవకై ఎంపికైన వీరంతా నిరంతరం దేశ రక్షణకై పరితపిస్తూ సైనికులుగా సేవలు చేయాలని విద్యార్థులకు సూచించారు.
కళాశాలలో ఇటీవల ఎన్.సి.సి- బి మరియు సి-సర్టిఫికెట్ పరీక్షలలో ఎన్.సి.సి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించినందుకు కళాశాల ఎన్. సి.సి అధికారి లెఫ్ట్నెంట్ డా.వై.పోలి నాయుడు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు కొనియాడారు. గత 10 సంవత్సరాలలో బెటాలియన్ లో గల అన్ని ఎన్.సి.సి సీనియర్ డివిజన్ విభాగంలో ఈ సంవత్సరం శత శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా హర్షనీయమని ప్రిన్సిపల్ తెలిపారు. అనంతరం బి మరియు సి సర్టిఫికెట్ ఉత్తీర్ణులైన క్యాడేట్లకు సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ ఆర్.హరిత జె.కె.సి కో ఆర్డినేటర్ డా. డి పైడితల్లి, పరిపాలనాధికారి ఎన్.సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.