మహాకవి గురజాడ అప్పారావు రచనల స్ఫూర్తిని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. మహాకవి రచనలు నిత్య నూతనమని, తెలుగుజాతి ఉన్నంతవరకూ అవి నిలిచిఉంటాయని జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు. గురజాడ అప్పారావు 160వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముందుగా గురజాడ స్వగృహంలోని చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ వినియోగించిన వస్తువులతో, సత్య కళాశాల జంక్షన్ వరకూ దేశభక్తి గేయాలను ఆలపిస్తూ, ప్రదర్శన నిర్వహించారు. అక్కడి గురజాడ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, గురజాడ వందేళ్ల క్రితం చెప్పిన ప్రతీమాటా ఆచరణ సాధ్యమని అన్నారు.
నాటి సామాజిక పరిస్థితులను బట్టి ఆయన కన్యాశుల్కం రాశారని, మళ్లీ కన్యాశుల్కం ఆచారం తిరిగి మొదలయ్యే పరిస్థితి నేడు నెలకొందని అన్నారు. సొంతలాభం కొంత మానుకోవాలని సమాజానికి దిశానిర్ధేశం చేశారని అన్నారు. ఆరోగ్య పరిరక్షణ గురించి ఆయన ఆనాడే చాలా గొప్పగా చెప్పారని అన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాల్సిన అవసరాన్ని శతాబ్దం క్రితమే చాటి చెప్పిన గురజాడ గొప్ప దూరదృష్టి గలవారని కొనియాడారు. ఆయన రచనలను అర్ధం చేసుకొని, వాటి స్ఫూర్తిని కొనసాగించడమే గురజాడకు అసలైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు.
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గురజాడ విశ్వకవి అని, ఆయన భావాలు విశ్వవ్యాపితమని కొనియాడారు. ఆయన రచనలు చిరస్మరణీయమని, తెలుగువారికి గురజాడ గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు భాష ఉన్నంతవరకూ గురజాడ రచనలు నిలిచి ఉంటాయని అన్నారు. ప్రధాని మోడి పలికిన దేశమంటే మట్టికాదోయ్... గురజాడ గీతాన్ని ఉదహరించారు. గురజాడ వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం నేటితరంపై ఉందన్నారు. విజయనగరం ఉత్సవాల్లో మహాకవి రచనలకు తగిన ప్రాధాన్యత ఇచ్చే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ ఇసరపు రేవతీదేవి, డిఆర్ఓ ఎం.గణపతిరావు, మున్సిపల్ కమిషనర్ ఆర్. శ్రీరాములనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, జిల్లా పర్యాటక శాఖాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వర్రావు, సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్, పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్ వైవి రమణ, మహిళాశిశు సంక్షేమ శాఖాధికారి బి.శాంతకుమారి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసన్న, సమగ్రశిక్ష ఎపిసి డాక్టర్ విఏ స్వామినాయుడు, గురజాడ కుటుంబీకులు వెంకటేశ్వరప్రసాద్, ఇందిర, లలిత, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు పివి నర్సింహరాజు, డాక్టర్ ఎ.గోపాలరావు, కాపుగంటి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రొంగలి పోతన్న, వివిధ సంస్థల ప్రతినిధులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.