షాపుల యజమానులు సహకరించాలి


Ens Balu
17
Srikakulam
2022-09-22 07:19:36

శ్రీకాకుళంనగరంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపుల గల షాపుల యజమానులు, తోపుడు బండ్లు కాలువలకు లోపలి భాగంలో వ్యాపారాలు కొనసాగించాలని, లేనిచో చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాలను సిబ్బందితో కలిసి పర్యటించారు. తొలుత నాగావళి నది వద్ద నిర్మిస్తున్న డైక్  దగ్గర వరద నుండి కాపాడేందుకు రూ.62 లక్షలతో నీటిపారుదల శాఖ నిర్మిస్తున్న రింగ్ బండ్ పనులను స్వయంగా పరిశీలించారు. ఇటీవల నదీ ప్రవాహానికి డైక్ వద్ద అడ్డుపడిన చెత్తను తొలగించే చర్యలు చేపట్టిన ఆయన తదుపరి ఆదివారంపేటలో రహదారికి ఇరువైపులా గల కాలువల్లో పూడికను సిబ్బందితో తీయించారు. కొత్తరోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పెయింటింగ్ పనులను పరిశీలించారు. 

అనంతరం నగరంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నున్స షాపుల యజమానులు, తోపుడు బండ్లు వ్యాపారులు చెత్తను కాలువల్లో వేస్తున్నారని, ఇకపై ఇటువంటివి చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే షాపుల యజమానులు, తోపుడు బండ్ల యజమానులు కాలువలకు లోపల భాగంలోనే వ్యాపారాలు కొనసాగించాలని, కాలువలు దాటి రహదారిపై వ్యాపారాలు కొనసాగించడం వలన వాహనాలకు,పాదచారులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కాలువలపై వ్యాపారాలు చేయడం వలన కాలువల్లోని శిల్టును తొలగించేందుకు సిబ్బందికి ఇబ్బందిగా మారుతుందని అన్నారు.

 వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని షాపులు,తోపుడుబండ్ల యజమానులు కాలువలకు లోపలి భాగంలో ఏర్పాటుచేసుకొని తమ వ్యాపారాలు కొనసాగించి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. వీటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ పర్యటనలో సానిటరీ సూపర్ వైజర్ గణేష్, సానిటరీ ఇన్ స్పెక్టర్ ఉగాది, కాంట్రాక్టర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.