శ్రీకాకుళం జిల్లాలోని వృద్ధ కళాకారుల కొత్త పింఛన్ల కొరకు సమర్పించవలసిన దరఖాస్తుల గడువును ఈ నెల 30వరకు పెంచినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి.రమణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. పించన్ల కొరకు దరఖాస్తుల స్వీకరణ విషయమై గతంలో ప్రకటన జారీచేసినప్పటికీ తక్కువ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఆ గడువును ఈ నెల 30 వరకు పెంపుదల చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఈ కార్యాలయానికి అందిన దరఖాస్తులు ఆధారంగా జిల్లా స్థాయి కమిటీలో చర్చించి అర్హత పొందిన కళాకారుల తుది జాబితాను రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, విజయవాడ వారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు.
కావున అర్హత గల కళాకారులు తమ పూర్తి చిరునామాతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్, అనుభవ పత్రాల ప్రతులతో నిర్ణీత దరఖాస్తు ఫారంలో నింపి సెప్టెంబర్ 30లోగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ, అఫీషియల్ కాలనీ, జె.సి గారి బంగ్లా దరి, శ్రీకాకుళం - 532 001 చిరునామాకు స్వయంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, గడువు దాటిన తదుపరి వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత దరఖాస్తు ఫారంను కార్యాలయ పనివేళల్లో ఉచితంగా పొందవచ్చని అన్నారు.