రాజమహేంద్రవరం జిల్లాలో రైతుల డేటా వివరాలు , ఈ కే వై సీ నూరు శాతం పూర్తి చెయ్యాలని, ఇంకా నమోదు కాలేని వారికి మూడు రోజుల సమయం మాత్రమే ఉందని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అన్నారు. గురువారం సాయంత్రం డివిజన్, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో 318000 మేర డాక్యుమెంట్స్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. వాటిని గ్రామ స్థాయి లో నిర్ధారణ చేసి ధృవీకరణ చెయ్యడం లో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామ వ్యవసాయ అధికారులు 87 శాతం, గ్రామ రెవెన్యూ అధికారులు 40శాతం మేర మాత్రమే డేటా ఎంట్రీ చేసిన వాటిపై ధృవీకరణ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టక పోవడం పై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర డివిజన్, మండల అధికారులు ఆయా మండలాలు నుంచి పాల్గొన్నారు.