మనబడి-నాడు,నేడు పనులు వేగం పెంచాలి


Ens Balu
16
Kakinada
2022-09-22 16:13:22

కాకినాడ జిల్లాలో  పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన రెండో దశ మనబడి-నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మన బడి-నాడు నేడు రెండో దశ పనులకు సంబంధించి అదనపు తరగతిగదుల నిర్మాణ పనులు, జగనన్న విద్యా కానుక, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-విద్యా సూచికలు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన  తదితర అంశాలపై గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, మౌలిక సదుపాయాల కల్పన ప్రత్యేక కమిషనర్ కాటమనేని భాస్కర్..అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానం ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టరు డా. కృతికా శుక్లా.. విద్యా, సమగ్ర శిక్ష, ఏపీడబ్ల్యూఐడిసి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. 

అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టరు మాట్లాడుతూ  జిల్లాలో మనబడి నాడు నేడు రెండో దశ కార్యక్రమములో భాగంగా సుమారుగా 904  అంగన్వాడీ, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో  నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.  విద్యా శాఖ, ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకొని నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇసుక, సిమెంట్ తదితరాలకు అవసరమైన ఇండెంట్ ను ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాల పాటించే విధంగా అధికారులు పర్యవేక్షించాలని  కలెక్టరు తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర, సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, ఏపీడబ్ల్యూఐడీసీ, ఆర్డబ్ల్యూఎస్ సుపరింటెండెంట్ ఇంజనీర్లు నటరాజన్, ఎం.శ్రీనివాసు, కె.లక్ష్మణరెడ్డి, ఎం.శ్రీనివాసు, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.