రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం స్పందనకు వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో, నాణ్యతతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కృతికా శుక్లా..జాయింట్ కలెక్టరు ఎస్.ఇలక్కియ, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మిలతో కలిసి ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో 298 అర్జీలు స్వీకరించారు. వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్ తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారానికి సంబంధించి ఫొటోలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి సందర్శన ఫొటోలను పరిష్కార నివేదికకు జతచేయాలని ఆదేశించారు. స్పందన అర్జీల పరిష్కార నాణ్యతా ప్రమాణాల తనిఖీలో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసే ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా అర్జీదారులకు ఫోన్ చేసి, పరిష్కారంపై అభిప్రాయాలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందనకు 66 అర్జీలు:
మధ్యాహ్నం కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, కెఎస్సీఈజెడ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు కె.మనోరమ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 66 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.