విజయనగరంలోని వార్డు సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ ఎ.సూర్యకుమారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయాలపై పర్యవేక్షణ పెంచాలని, సిబ్బంది పనితీరును మెరుగు పర్చాలని ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని పద్మావతి నగర్‌లో ఉన్న 37 వ సచివాలయాన్ని, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను, హాజరు పట్టీని పరిశీలించారు. వివిధ పథకాల అమలు తీరును, స్పందన గ్రీవెన్స్‌ను పరిశీలించారు. మహిళా పోలీసు, ఎఎన్ఎం లను ప్రశ్నించారు. వారి పనితీరుపట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరు మెరుగుపడాలని, ఇదే తీరు చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై సచివాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతానని, తేడాగా వ్యవహరించే సిబ్బందిని ఇంటికి పంపిస్తానని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి, మున్సిపల్ హెల్తాఫీసర్ డాక్టర్ కెవి సత్యనారాయణ, సచివాలయాల కన్వీనర్ హరీష్ పాల్గొన్నారు.