పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటకం శోభిల్లాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని ఆయన చెప్పారు. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలో ఎకో టూరిజం క్రింద గిరిజన ఒకటి, రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటకులు ఒక రోజు గ్రామంలో గడిపి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద కన్వెన్షన్ సెంటర్, వ్యూ పాయింట్, ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ఇందుకు పార్వతీపుం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జలవనరుల శాఖ అధికారులతో సహా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్, రివర్ ఫ్రంట్ కాటేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బ్యాటరీ ట్రైన్ సౌకర్యం కల్పించి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించుటకు అవకాశాలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో పర్యాటక, జాతీయ రహదారి కలుపుతూ తూర్పు కనుమల కారిడార్ (ఈస్టర్న్ ఘాట్స్ కారిడార్) ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. తద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని, సామాన్య ప్రజల ఆదాయం వృద్ది చెందగలదని ఆయన చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రెండు నుండి ఐదు ఎకరాల స్థలంలో శిల్పారామం, బడ్జెట్ హోటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో టూరిజం కార్పొరేషన్ డివిజన్ (ఎకో టూరిజం) కార్యాలయం, డెప్యూటీడిఇ , ఏఇలతో కూడిన టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
పర్యాటక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక విశేషాలు తెలియజేస్తూ వెబ్ సైట్ రూపొందించాలని, ఇతర ప్రధాన వెబ్ సైట్లుతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.