మత్స్యకారులు సంయమనం పాటించాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాధన్ సూచించారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళనలకు సంబంధించి బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్యకార సంఘాలతో జాయింట్ కలెక్టర్ ఆర్డీవో, మత్స్యకార సహాయ సంచాలకులు తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా మత్స్యకార సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో పోర్ట్ యాజమాన్యంతో జరిగిన ఒప్పందాలను జాయింట్ కలెక్టర్ కు వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వివాద పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. మత్స్యకార సంఘాల నాయకులు ఈ సమస్యకు సంబంధించి ఏమైనా వినతులు ఉంటే ఆర్డీవో కి సమర్పించాలని అన్నారు.
త్వరలోనే ఈ విషయమై ఉన్నతాధికారులతో సమీక్షించి సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతవరకు ప్రభుత్వ ఆదేశాలను గౌరవించాలని కోరారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఓడముతిల పెంటయ్య, అధ్యక్షులు సురకల జయకుమార్ (జంపన్న), వైస్ ప్రెసిడెంట్ తాతాజీ, సెక్రెటరీ అయ్యప్పరాజు, నగర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్, తదితర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.