సంక్షేమ పథకాలపై ప్రత్యేక శ్రద్ద కనబరచాలి


Ens Balu
13
Paderu
2022-09-29 11:55:10

రాష్టంలో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం, ఇ-క్రాప్, ఉపాధిహామీ, వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణాలు, గృహాల మంజూరు, జగనన్న భూహక్కు మరియు భూరక్ష, స్పందన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు,ఎస్.పిలు,సంయుక్త కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధిహామీ పనులు బాగా జరుగుతున్నాయని, ఉపాధిహామీ, స్పందనలో మంచి ప్రగతిని కనబరచారని, ఇందుకు సహకరించిన కలెక్టర్లను అభినందిస్తున్నట్లు తెలిపారు.  ఉపాధిహామీ పనుల్లో వేతనదారులు కనీస వేతనం రూ.240లు అందుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, ఏఎంసియులు, బిఎంసియులు, వై.ఎస్.ఆర్.డిజిటల్ లైబ్రరీలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.  ఇ-క్రాప్ పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొదటి దశలో వి.ఆర్.ఓ, వి.ఏ.ఓలు క్షేత్ర స్థాయిలో  రైతుల భూములను పరిశీలించి ఫోటోలు తీసి సెప్టెంబర్ 30నాటికి ప్రక్రియను పూర్తిచేయాలని అన్నారు. రెండవ దశలో వి.ఆర్.ఓ, వి.ఏ.ఓలు బయోమెట్రిక్ ద్వారా దృవీకరించాలని, మూడవ దశలో రైతుల బయోమెట్రిక్  దృవీకరణతో ఇ-క్రాప్ ప్రోసెస్ అంతా పూర్తవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 10నాటికి పూర్తిచేసి, డిజిటల్ మెసేజ్ ద్వారా రైతులకు రసీదును అందించాలని అన్నారు. అక్టోబర్ 15 నుండి 22 వరకు సోషల్ ఆడిట్ కావాలని, తదుపరి 25 నుండి 31వరకు రైతుల తుది జాబితాను పబ్లిష్ చేసి రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని సూచించారు. నవంబర్ 1 నుండి వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. తక్కువ సమయం ఉన్నందున కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

2022 మే 11నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం అయిందని, రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామాలను సంబంధిత మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బృందంగా ప్రతి ఇంటిని సందర్శించడం జరిగిందన్నారు. ప్రతి బృందం నెలలో ఆరు సచివాలయాలను, రెండు రోజుల పాటు పర్యటిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ నిధులను శాసనసభ్యుల ఆమోదంతో పనులు చేపట్టేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చే సమస్యలపై తక్షణమే కలెక్టర్లు స్పందించాలని, ఇందులో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వచ్చే నెల 5 నాటికి చేపట్టవలసిన పనులపై కలెక్టర్లు మంజూరు ఉత్తర్వులు జారీచేయాలని, అక్టోబర్ చివరి నాటికి పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వివరించారు. 

నవరత్నాల్లో భాగంగా చేపట్టిన  పేదలందరికి ఇల్లు నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. గృహ నిర్మాణాల్లో ఎటువంటి బిల్లులు పెండింగ్ లేవని స్పష్టం చేశారు. సకాలంలో అన్ని గృహ నిర్మాణాలు పూర్తిచేసి లబ్దిదారులకి అందించాలని అన్నారు. ప్రతి గృహానికి తాగునీరు, విద్యుత్, మురుగునీటి కాల్వల సదుపాయంతో పాటు మంచి రంగులు వేయాలని సూచించారు. ప్రతి జగనన్న కాలనీకి స్వాగతం పలికే ఆర్చ్ ఉండాలని, దాన్ని చూడగానే మంచి అభిప్రాయం లబ్ధిదారులకు కలిగేలా  ఏర్పాటు చేయాలన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ గృహాలు కోల్పోరాదని, మూడవ విడతలో అందరికి ఇల్లు మంజూరు కావాలని ఆదేశించారు. జగనన్న భూహక్కు - భూరక్ష వచ్చే నెలలో ప్రారంభం కానుందని, రానున్న 90 రోజుల్లో పట్టాల కార్యక్రమం పూర్తికావాలని ఆయన ఆకాక్షించారు. లబ్దిదారుని ఫోటోతో భూహక్కు పట్టాలు పంపిణీ చేయనున్నందున ఎటువంటి తప్పులకు తావులేకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. 

గ్రామ సచివాలయాల పరిధిలోని అధికారులు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్పందనపై వచ్చే వినతుల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అన్ని సమస్యలు సచివాలయాల పరిధిలోనే పరిష్కారం కావాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో 14400 ఏ.సి.బి నెంబరును కనిపించే విధంగా బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ప్రతి విశ్వ విద్యాలయం, కళాశాలల్లో దిశా పోలీస్ స్టేషన్ నెంబర్లను అందరికి కనిపించే విధంగా ఉంచాలని సూచించారు. అక్టోబర్ 26న రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీని, నవంబర్ 10న వసతి దీవెన అందిస్తామని వివరించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ జే శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడిఎ పిఒ రోణంకి గోపాల కృష్ణ, డిఎంహెచ్ఓ డా.బి సుజాత, డిపిఓ కొండల రావు, డిఆర్డిఎ  పిడి వి. మురళి వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు ఎస్ బి ఎస్.  నందు, రమేష్ కుమార్, హౌసింగ్ పిడి శ్రీనివాస రావు, పిఐయు ఇఇ కే. లావణ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.