కాకినాడ జిల్లాలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా వ్యవసాయ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, జాయింట్ కలెక్టర్లతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ. 20 లక్షలు కేటాయించిన నేపథ్యంలో ఆయా సచివాలయాల పరిధిలో ప్రాధాన్య పనుల మంజూరు, ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలైన సచివాలయాలు, ఆర్‌బీకేలు, డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాల్లో పురోగతి, ఈ-క్రాప్ బుకింగ్, జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష, స్పందన కార్యక్రమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ), జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూ సేకరణ, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి.. దిశానిర్దేశం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుకు ఈ-క్రాప్ బుకింగ్ డేటా కీలకమైనందున ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఉన్న వీఏఏ, వీఆర్‌వోల పంట పొలాల సందర్శనలు, ఫొటోల అప్‌లోడ్, రైతుల ఈ-కేవైసీ తదితర దశలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించాలని కలెక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ఎన్.వి.వి.సత్యనారాయణ, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, పీఆర్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.