విజయనగరంజిల్లాలో వివిధ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ప్రణాళికాయుతంగా ముందుకెళ్లి నిర్ణీత కాలంలో లక్ష్యాలను చేరుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లీనిక్, వెఎస్సార్ అర్బన పీహెచ్‌సీల నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరిగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రభుత్వ సేవలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో గురువారం జరిగిన వీసీలో పాల్గొన్న ఆమె జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనుల గురించి వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువాంర తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పనులు, మంజూరైన పనులు, ఈ-క్రాపింగ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, యూపీహెచ్‌సీలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు తదితర పనులపై, పథకాలపై ఆయన సమీక్షించారు. భవిష్యత్తులో చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు. జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని, రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌లు, యూపీహెచ్‌సీల పనుల్లో మరింత పురోగతి సాధించాలని, డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉత్తమ ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ ఎ. సూర్యకుమారితో పాటు, ఎస్పీ దీపికా ఎం. పాటిల్, జేసీ మయూర్ అశోక్, కె.ఆర్.ఆర్.సి. ప్రత్యేక ఉప కలెక్టర్ సూర్యనారాయణ, సీపీవో బాలాజీ, జడ్పీ సీఈవో అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. ఆర్.ఎస్. గుప్తా, డ్వామా పీడీ ఉమా పరమేశ్వరి, హౌసింగ్ పీడీ రమణమూర్తి, సర్వే విభాగం సహాయ సంచాలకులు త్రివిక్రమరావు, టిడ్కో ఈఈ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.