అభివృద్ధి అనే పేరుతో వచ్చిన సరోగసీ విధానం సృష్టికి విరుద్దమని, అమ్మతనానికి అగౌవరమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు వ్యాఖ్యానించారు. మన సమాజంలో మహిళలకు ఎంతో ఓర్పు, సహనం ఉంటాయని అలాంటి మహిళలను, అమ్మతనాన్ని అగౌరవ పరిచే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల సందర్శనలో సరోగసీ విధానం ద్వారా చేస్తున్న ప్రక్రియ తనని ఆశ్చర్యానికి గురి చేసిందని గుర్తు చేశారు. పూర్తిస్థాయి ప్రభుత్వ నిబంధనలు, పర్యవేక్షణతో సాగాల్సిన ఆ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని, దారితప్పుతోందని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగ, వ్యాపార, ఇతర కార్యకలాపాల్లో బిజీ అయిపోయిన కొంతమంది ఈ విధానానికి మొగ్గు చూపుతున్నారని, అది సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన పోషణ్ అభియాన్ మాసోత్సవాల ముగింపు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని గర్భిణుల, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రశంసణీమయైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంబంధిత పథకాలను లబ్ధిదారులకు అందేలా అంగన్‌వాడీ సిబ్బంది శ్రద్ధాశక్తులు వహించాలని ఈ సందర్భంగా సూచించారు. గర్భిణులకు అన్ని దశల్లో అండగా ఉంటూ వారికి తగిన సలహాలు, సూచనలు అందించాలని హితవు పలికారు. వారికి సమతుల్య ఆహారం అందించాలని, ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పారు. అలాగే ఆడపిల్లలు అంటే చిన్న చూపు పోవాలని వారికి తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అంగన్‌వాడీల ద్వారా అందుతున్న సేవలు ప్రశంసణీయమైన పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఆయన కితాబిచ్చారు.
అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పదిమంది గర్భిణులకు సీమంతాలు, ఐదుగురు చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయాలను అనుసరించి గర్భిణులకు చీర, గాజులు, ఇతర సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరూ చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ బి. శాంతకుమారి, మహిళా- శిశు సంక్షేమ సంఘం ప్రాంతీయ చైర్ పర్శన్ మాధురి వర్మ, సీడబ్ల్యూసీ ఛైర్ పర్శన్ బిందు మాధవి, స్టాండింగ్ కమిటీ ఛైర్ పర్శన్, బొబ్బిలి జడ్పీటీసీ శాంతకుమారి, ఎన్.ఆర్.సి. కేంద్ర కో-ఆర్డినేటర్ డా. స్వర్ణలత, ఐసీడీఎస్ ఈవోలు, సీడీపీవోలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.