శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖలో పునర్వ్యవస్థీకరించబడిందని జిల్లా అటవీ శాఖ అధికారి నిషా కుమార్ ఒక శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గతంలో శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్ 70,876.02 హెక్టార్ల విస్తీర్ణంలో 5 రేంజ్ లు అంటే శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పాతపట్నం & కాశీబుగ్గ, 22 ఫారెస్ట్ సెక్షన్లు, 43 ఫారెస్ట్ బీట్లతో ఉండేదన్నారు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో పాలకొండ, పాతపట్నం ఫారెస్టు రేంజ్ లో కొంత భాగం కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం ఫారెస్ట్ డివిజన్ లో విలీనం చేయబడిందని వివరించారు. నూతనంగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా పునర్వ్యవస్థీకరించబడిన శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్లో 4 రేంజ్ లు ( శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం & కాశీబుగ్గ), 18 ఫారెస్ట్ సెక్షన్లు, 31 ఫారెస్ట్ బీట్లతో 44,574.95 హెక్టార్ల అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పునర్వ్యవస్థీకరించబడిన శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్ యొక్క అధికార పరిధి శ్రీకాకుళం జిల్లా పరిధిని కలిగి యున్నదన్నారు. శ్రీకాకుళం సోషల్ ఫారెస్ట్రీ డివిజన్, గతంలో 5 సోషల్ ఫారెస్ట్రీ రేంజ్లను, శ్రీకాకుళం - 1, శ్రీకాకుళం - II, శ్రీకాకుళం - IV, నరసన్నపేట & పాలకొండ కలిగి ఉండేదని, ప్రస్తుతం పాలకొండ సోషల్ ఫారెస్ట్రీ రేంజ్ మినహా శ్రీకాకుళం సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ టెరిటోరియల్ డివిజన్ లో విలీనం చేయబడిందని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (HoFF), ఆంధ్రప్రదేశ్, గుంటూరు జారీ చేసిన సూచనల ప్రకారం పై అధికార పరిధితో పునర్వ్యవస్థీకరించబడిన / శ్రీకాకుళం ఫారెస్ట్ డివిజన్ 28.09.2022 నుండి పని చేయడం ప్రారంభించినట్లు ఆ ప్రకటనలో వివరించారు.