ప్రభుత్వ పథకాల లక్ష్యాలను అధిగమించాలి


Ens Balu
12
Visakhapatnam
2022-09-30 10:05:06

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న హౌసింగ్‌, వ్యవసాయ, ఎస్‌హెచ్ జి  బ్యాంక్‌ లింకేజ్‌ ,జగనన్న తోడు తదితర రంగాలకు లక్ష్యం మేరకు రుణాలందించి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వాములు కావాలని  జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్ధాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టరు అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరు  మాట్లాడుతూ జిల్లాలో  అర్హులైన  వారందరికి ఇళ్లు  మంజూరు గావించడం జరుగుతోందని,  వారికి ఇళ్లు  నిర్మాణాలను పూర్తి గావించడంలో రుణాలను మంజూరు లో బ్యాంకర్లు  సహకరించాలన్నారు.  జిల్లాలో లక్ష ఇళ్లు జి.వి.ఎం.సి పరిధిలో మంజూరు కాబడ్డాయన్నారు. అదే విధంగా ఏపీ టిడ్కో ఇండ్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు.  

జగనన్న తోడు వంటి పధకాల క్రింద చిరు వ్యాపారులకు ఆర్ధిక సహకారాన్ని అందించాలని,  ఈ విషయంలో బ్యాంకర్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. అగ్రికల్చర్ మరియు నాబార్డు స్కీంల క్రింద  వ్యవసాయ దారులకు, మత్స్యకారులు  మరియు  పాడి రైతులకు  పథకాల మంజూరులో  ఎదురయ్యే సమస్యలను  బ్యాంకర్లు  అధికారులతో చర్చించి వాటిని  నివృత్తి  చేసుకుని లబ్దిదారులకు  లబ్ది చేకూర్చాలన్నారు.   బ్యాంకింగ్ సేవలకు దూరంగా వున్న గ్రామాలలో  రైతు భరోసా కేంద్రంలో ఏ. టి.ఎం లు ఏర్పాటు చేయాలని ఎల్. డి ఎం కు సూచించారు. గ్రామాలలో రైతుల కోసం రుణ మేళాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.వ్యవసాయ యాంత్రీకరణకు రైతులకు  రుణాలు అందించాలని అన్నారు.

 తదుపరి కలెక్టరు ఎమ్.ఎస్.ఎం.ఇ, ముద్ర లోన్స్, స్టాండ్అప్ ఇండియా, పీ.ఎం స్వనిధి, పీఎంఈజీపీ తదితర కార్యక్రమాల క్రింద రుణాల మంజూరు పై బ్యాంకర్లతో సమీక్ష చేసారు.   ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు కె.ఎస్.విశ్వనాధన్, ఎల్.డి.ఎం  వి.ఎస్. శర్మ,  ఆర్.బి.ఐ, ఎల్.డి.ఓ  పీ.ఎం. పూర్ణిమ, డిఆర్డిఏ పి.డి శోభారాణి , జీ.వి.ఎం.సి యు.సీ.డి పాపి నాయుడు, జెడి పశుసంవర్ధక శాఖ డా.రామకృష్ణ, జెడి మత్స్యశాఖ సుమలత, పలువురు జిల్లా అధికారులు, బ్యాంకర్లు ఈ సమావేశానికి హాజరైయ్యారు.