సంపూర్ణ పోషకాహార పథకం పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని , ఏక్కడా మాతా శిశు మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఐ సి డి యస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం భీమవరం పురపాలక సంఘం నుండి ఐ సి డి యస్ ఆధ్వర్యంలో అంగనవాడి కార్యకర్తలు, కిషోర్ బాలబాలికలు తదితరులు సంపూర్ణ పోషకాహార పథకాలు, ఇతర పథకాల అవగాహన పై 2 కె రన్ ర్యాలీని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, సుషోషిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుటకు పోషకాహార మాసోత్సవాలు విజయవంతంగా జరిగాయని, ఈరోజు ముగింపు రోజని సుపోషణ గ్రామాలు, వార్డులు దిశగా అడుగులు వేద్దామని ఆమె అన్నారు. జిల్లాలో 1562 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతలు , శిశువులకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించేందుకు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించటం జరిగిందని ఆమె అన్నారు.
ప్రతి అంగనవాడి కేంద్రాలలో ఖాళీ స్థలంలో న్యూట్రీగార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చెయ్యాలని, అందరికీ పౌష్టికాహారం పై మరింత అవగాహన కలుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి సంపూర్ణ పోషకాహార పథకం ప్రజలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని, భవిషత్ లో కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సి డి పి వోలు, సిబ్బంది ముఖ్యపాత్ర పోషించాలని, అంగన్వాడీ కేంద్రాలలో పండుగ వాతావరణం సృష్టించడం, ఆశా వర్కర్లు వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ యొక్క న్యూట్రిషన్ కిట్ల ను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఇవ్వాలని ఆమె అన్నారు. ఇచ్చిన వస్తువులను సరిగ్గా ఉపయోగించేలా సంపూర్ణ పోషకాహారం ఏవిధంగా పొందవచ్చునో వారికి వివరించాలని కలెక్టరు అన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అందిస్తున్న రాగి, సజ్జ , జొన్న , అటుకులు, ఎండు ఖర్జూరం , బెల్లం వేరుశనగ చిక్కీలు వంటి పౌష్టికాహారంతో పాటు పాలు, గుడ్లు వినియోగాన్ని వారికి వివరించాలని ఆమె అన్నారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఏ ఆహారం తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి వివరించాలని, జిల్లాలో ఎక్కడ పోషకాహారం లోపంతో గర్భిణీలు, బాలింతలు ,శిశువులు ఏవరూ ఉండకూడదని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు. ఇంటికి వెలుగు పాపాయి - కంటికి వెలుగు బొప్పాయి , ఆహారం పై సమాచారం ఇంటింటికి చేర వేద్దాం, చిరు ధాన్యాల ఆహారంలో భాగస్వామ్యం చేసుకుందాం అనే నినాదాలతో పురపాలక సంఘం నుండి ప్రకాశం చౌక్ వరకూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో జిల్లా రెవిన్యూ అధికారి కె. కృష్ణ వేణి, ఐ సి డి యస్ పి డి బి. సుజాతా రాణి, పురపాలక సంఘం కమీషనరు యస్. శివ రామ కృష్ణ, సి డి పి వో లు వి. వాణి విజయ రత్నం, సి హెచ్ ఇందిర,బి. ఊర్మిళ, మేరీ ఎలిజబెత్, పి ఆర్ రత్న కుమారి,శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ. రంగ సాయి, నరహరి శెట్టి. కృష్ణ, తది తరులు పాల్గొన్నారు.