త్వరలోనే 3మూడు రాజధానుల బిల్లు..


Ens Balu
11
2022-10-10 16:29:51

మూడు రాజధానుల బిల్లు త్వరలోనే ప్రవేశపెడతామని, ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సర్క్యూట్ హౌస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణకు అన్ని వర్గాల నుంచి మద్దతు పుష్కలంగా లభిస్తోందని, విశాఖ పరిపాలన రాజధాని కావడాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు గొప్ప అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. ఎవరైనా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే వద్దు అనరని, టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారని, ఆయన నైజాన్ని ఈ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు అజెండాను అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలపై రుద్దడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.

 25 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని ఉత్తరాంధ్రకు మేలు జరిగే కార్యక్రమం ఒకటైన చేశారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన అచ్చెన్నాయుడు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను గౌరవించటం లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని..  వికేంద్రీకరణ, విశాఖ పరిపాలన రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం ఆత్మహత్యా సదృశ్యమేనని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకం అయితే మీరు మాట్లాడకండి.. చంద్రబాబు నాయుడు బంట్రోతు లుగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నష్టం చేయొద్దని ఆయన అచ్చెన్నాయుడుకు హితవు చెప్పారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే వ్యక్తుల నోర్లు మూయించేoదుకే విశాఖ గర్జనను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.పాదయాత్ర పేరుతో చేసిన దండయాత్రలు నిలువరించేందుకే ఈ గర్జన అని  ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తున్న పాదయాత్రికులు భయపడే విధంగా గర్జన ఉంటుందని అమర్నాథ్ వివరించారు.

చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కొత్తగా వికేంద్రీకరణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అమర్నాద్ అన్నారు. గర్జనపై ఆయన చేసిన ట్వీట్లు చంద్రబాబు విధానాలకు అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. 'ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ.. ఇక్కడి ప్రజల కష్టాల గురించి  గానీ మీకు తెలియవు.. గర్జన గురించి మీకేం తెలుసు? మీకు గర్జించడం రాదు..' అని పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గత  ఎన్నికల్లో విశాఖ ప్రజలు మిమ్మల్ని ఓడించినందువల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతోనే మీరు వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా దుయ్యబట్టారు.

 ఎవరి రాజధాని అమరావతి అన్న పుస్తక ఆవిష్కరణ సభలో మీరు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలని అమర్నాథ్ పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పవన్ కళ్యాణ్ కి నటన నేర్పింది. ఆయన నట జీవితానికి వన్నెతెచ్చిన విశాఖకు వెన్నుపోటు పొడవాలని పవన్ భావించటం బాధాకరమని అన్నారు.  వికేంద్రీకరణ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని,  ఈ విధానం సరైనది కాదని భావిస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అమర్నాథ్ చెప్పారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానుల బిల్లు తో ముందుకు వస్తానని అమర్నాథ్ పునరుద్ఘాటించారు.
సిఫార్సు