విజయనగరం జిల్లాలో భారీవర్షాలు తగ్గినప్పటికీ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగే అవకాశం వున్నందున మత్స్యకారులు గానీ ఇతరులు గానీ చేపలు పట్టేందుకు వాగుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు అప్రమత్తంగా వుంటూ ఎవరూ నదుల్లోకి, వాగుల్లోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలన్నారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లాలోని తహశీల్దార్‌లు, ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వర్షాల కారణంగా పంట పొలాలు ముంపునకు గురైతే అటువంటి సమాచారాన్ని జిల్లా అధికారులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గాయని ఆదమరచి వుండొద్దని, ఆయా మండలాల్లో నిరంతరం పరిస్థితిని గమనిస్తూ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టం వివరాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టం వివరాలను ఆయా గ్రామ వ్యవసాయ సహాయకుల నుంచి సేకరిస్తున్నట్టు తెలిపారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేవరకూ మండలాల్లోని క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు.