రాష్ట్రంలో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందించడం జరుగుతుందని, ఇటువంటి ప్రక్రియ గతంలో ఎన్నడూ లేదని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ప్రభుత్వ సేవలను అందుకొని ప్రజలు సంతృప్తి చెందిననాడే ఆ ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి కలుగుతుందని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్న ప్రతినిధులను మంత్రి ధర్మాన ఈ సందర్భంగా అభినందించారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక గుడి వీధి సచివాలయ పరిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినప్పటికీ చాలామందికి కనీస సదుపాయాలు కూడా అందడం లేదన్నారు. అటువంటివారికి మనస్పూర్తిగా ఈ ఐదేళ్లు అందించేలా పథకాలను రూపకల్పన చేయడం జరిగిందని గుర్తుచేసారు. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పామని, దీనిపై ప్రజలకు ఆమోదయోగ్యం అయితేనే ఓటు వేయమని కోరామని, ప్రజలు విశ్వసించి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగిందని గుర్తుచేసారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండే సంక్షేమ పథకాలను అమలుచేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకాలన్నీ కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా కన్నీరు, ఆకలి, బీదరికం, అవసరాలను గుర్తించి వారికే అమలుచేయాలని నిర్ణయం తీసుకొని అమలుచేస్తున్నామని తెలిపారు.
గతంలో సంక్షేమ పథకాలు పొందాలంటే రాజకీయ నాయకులకు సలామ్ చేస్తూ, వారి ఆంక్షలు మేరకు పథకాలను లబ్ధిపొందేవారని, వారికి కోపం వస్తే పథకాలను తీసేస్తామని బెదిరింపులు కూడా గతంలో ఉండేవని అన్నారు. ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తిపలికి, వాటన్నింటికి భిన్నంగా సంక్షేమ పథకాల కేలండరును విడుదల చేసి, ప్రతి పథకం అక్కచెల్లెమ్మల, అన్నదమ్ముల ఖాతాల్లోకే నేరుగా జమచేస్తున్న సంగతిని గుర్తుచేసారు. లబ్ధిదారులు పొందిన నగదును తమ అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేసుకునేలా వెసులుబాటును కల్పించడం జరిగిందన్నారు. ప్రజల చెంతకే ప్రభుత్వాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వ సంక్షేమ ఫలాల అమలు వివరాలను తెలుసుకుంటూ, అదనంగా ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని అమలుచేసేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు, చల్లా శ్రీనివాసరావు, భవానీ, శంకరరావు, నీలాద్రి, చిన్నబాబు, సునీలు, హైమా, నగరపాలక సంస్థ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.