దేశం కోసం యువత పనిచేయాలని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు జిల్లాలోని యువతకు పిలుపునిచ్చారు. దేశం మనకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. బుధవారం మునసాబుపేటలోని గురజాడ విద్యా సంస్థలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో నెహ్రు యువ కేంద్రం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ యువతకు సామాజిక స్పృహ, బాధ్యతతో పనిచేయాలని కోరారు.
స్వామి వివేకానంద ఆశయాలు, స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసిననాడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. మానవ జీవితంలో తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారికే ఉన్నత భవిష్యత్ ఉంటుందని వివరించారు. తొలుత విద్యార్థుల అభిప్రాయాలను ముఖ్యఅతిథి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం తిలకించారు. ముఖ్యఅతిధికి నెహ్రు యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్ ఉజ్వల్ ఇతర అధికారులతో కలిసి దుశ్శాలువ, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్ ఉజ్వల్, జాతీయ యువ కార్యకర్తలు ఎంపిక కమిటీ సభ్యులు పూడి బాలఆదిత్య, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.వి.ప్రసాదరావు, జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు, ఎస్.సి. కార్పొరేషన్ పథక సంచాలకులు కె.రామారావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మరియు జిల్లా చీఫ్ కోచ్ స్పోర్ట్స్ ఎం.మాధురిలత, గురజాడ విద్యాసంస్థలు సంచాలకులు, ప్రిన్సిపాల్ అంబటి రంగారావు, డా.పులఖండం శ్రీనివాసరావు, ఐతం కళాశాల డీన్ ఆచార్య డి.విష్ణుమూర్తి,ఎన్.వై.కె గణాంకాధికారి డి. శ్రీనివాసరావు,ఇతర అధికారులు, పెద్దఎత్తున యువతీయువకులు తదితరులు పాల్గొన్నారు.