రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వికేంద్రీకరణకు ఉత్తరాం ధ్ర ప్రాంతం నాయకులు జండా, అజెండాలను పక్కనపెట్టి మద్దతివ్వాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరించేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నాన్ పొలిటికల్ జెఏసి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15వ తేదీన చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ లోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళనీయకుండా ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ రాజధానిగా వద్దంటూ అమరావతి రైతులు దండయాత్రగా మనమీదికి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు అన్ని ప్రాంతాలకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే యువకులు విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రైతులు ఈ ఉద్యమానికి మద్దతుగా వస్తున్నారని అమర్నాథ్ తెలియజేశారు. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, ఆఉచ్చులో చిక్కుకోబోమని అమర్నాథ్ చెప్పారు.
మాజీ మంత్రి, పార్టీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, 15న జరిగే విశాఖ గర్జన ఏ వ్యక్తికో, ఏ కులానికో సంబంధించినది కాదని, ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. రాజకీయ లబ్ది కోసం తాము ఈ పోరాటం చేస్తున్నామని వివిధ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని, వారే వచ్చి ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని, లబ్ధి అంతా వారే పొందినా మాకు అభ్యంతరం లేదని అవంతి అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని టిడిపి నేతలు చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన తీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్ముతున్నారని ఆయన ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు.
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖ గర్జన ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, దీనికి మద్దతుగా గ్రామ, మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో, అన్ని పార్టీలు ఆత్మ ప్రబోధం చేసుకొని పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జేఏసీ వైస్ చైర్మన్ దేవుడు మాస్టార్ మాట్లాడుతూ అన్ని పార్టీలు జెండాలు, అజెండాలు పక్కనబెట్టి వెనకబాటు తనం నుంచి ఉత్తరాంధ్ర బయటపడే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి మీడియా రంగం వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే న్యాయపరంగా, రాజకీయంగా అడ్డుకుంటున్నారని దాన్ని తిప్పికొట్టే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.