భవిష్యత్ విశాఖ కోసం కలికట్టుగా గర్జిద్దాం


Ens Balu
4
2022-10-12 11:39:14

 ''ఇప్పటి వరకు మనం అనేక ఉద్యమాలు చేశాం.. వీటన్నిటికన్నా మించింది విశాఖ గర్జన అని..  ఇది మనం పుట్టిన ప్రాంతం కోసం చేస్తున్నాం'' అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 15న జరిగే విశాఖ గర్జన సభకు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రాంత ప్రజలను సమాయత్తం చేసేందుకు వుడా చిల్డ్రన్ థియేటర్ లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమం భావితరాల కోసం చేస్తున్నదిగా అన్ని వర్గాలవారు గుర్తించాలని, మనప్రాంతానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను వెనుకబాటుతనంలోకి నెట్టేశాయని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసినా, చంద్రబాబు నాయుడు  అమరావతిని రాజధానిగా ప్రకటించారని ఆయన అన్నారు. 

తెలంగాణ పోరాటం రాష్ట్రం కోసం కాదని, హైదరాబాద్ కోసమని, ఇప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదని అమర్ నాథ్ అన్నారు. విభజన సమయంలో మనం చాలా నష్టపోయామని, మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని మూడేళ్ల అయిందని, దీనికి ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు కల్పిస్తున్నాయని అన్నారు. విశాఖను రాజధాని కానిచ్చేదిలేదని దండయాత్ర చేస్తున్న వారిపై విశాఖ ప్రజలు గర్జించాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు. విశాఖను రాజధానిగా చేయడం వెనుక ఉన్న ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం మనపై ఉందని ప్రజాప్రతినిధులకు మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు. భిన్న సంస్కృతులకు ఆలవాలమైన విశాఖ నగరం రాజధానిగా ఎందుకు కాకూడదు? అని అమర్నాథ్ ప్రశ్నించారు.

మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్ ను పోరాడి సాధించుకున్నామని, ఇప్పుడు విశాఖ రాజధాని  కాకుండా చేస్తున్న వారితో పోరాడి రాజధానిని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసే మంచి పనులను చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అడక్కుండానే విశాఖను పరిపాలన రాజధానిగా చేసే అపూర్వ అవకాశం మనకు ఇచ్చారని అన్నారు. విశాఖలో వైసిపి నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన అన్నారు. 

ఇలా విమర్శిస్తున్న వారు భూములు ఎవరు కబ్జా చేశారో తన వద్దకు వచ్చి చెప్పాలని అవంతి కోరారు. బాబు నీచ రాజకీయాలకు బలి కావద్దని పవన్ కళ్యాణ్ కు అవంతి హితవు చెప్పారు. తూర్పు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనం గర్జనకు  తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మేయర్ హరి వెంకట కుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, పలువురు కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వీరు చిల్డ్రన్ థియేటర్ నుంచి సిరిపురం జంక్షన్ వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు.
సిఫార్సు