తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ "నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ" నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ₹.35 వేలు వరకు అదనపు రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్డిఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో అదనపు బ్యాంకు లింకేజి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 51919 మంది లబ్ధిదారులకు నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా ఇంటి స్థలాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసే విధానం లో అదనపు ఆర్థిక చేయూత కావలసిన లబ్ధిదారులకు క్షేత్ర స్థాయి సిబ్బంది రూ.35 వేలు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కు కృషి చేయవలసి ఉంటుందన్నారు.
స్వయం సహాయక సంఘాలలో ఉండే మహిళా సభ్యులతో పాటు, సంఘం లో లేని వారికి కూడా అదనపు బ్యాంకు రుణాలు మంజూరు కై కృషి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలోని 15,173 మందికి రూ.53.11 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 4,062 మందికి రూ. 22.58 కోట్ల మేర అదనపు బ్యాంకు రుణాలు గా అందించడం జరిగిందన్నారు. ఇంకా ఎస్ హెచ్ జి లో ఉన్న వారితో పాటుగా ఎస్.హెచ్. జి ల్లో లేని 14,119 మందికి రుణ సౌకర్యం కల్పించే బాధ్యత మండలం లో పనిచేసే సిబ్బంది తీసుకోవాలన్నారు. ఇందుకోసం బ్యాంకర్ల తో మాట్లాడి ఇళ్ళ నిర్మాణం కోసం చేపట్టే పనులు పూర్తి చేయాలన్నారు. కొవ్వూరు, నిడదవోలు పురపాలక పరిధిలో చక్కని ఇండ్ల స్థలాలు ఉన్నాయని, వాటిలో ఎందుకు ఇంటి నిర్మాణాలు వేగవంతం చెయ్యలేక పోతున్నారని ప్రశ్నించారు.
గోకవరం, పెరవలి మండలాల్లో పురోగతి కనిపిస్తోందని, కోరుకొండ, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ జిల్లా స్థాయి సగటు కంటే తక్కువగా ప్రగతి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. నాన్ ఎస్ హెచ్ జి లను గ్రూప్ గా ఏర్పాటు చెయ్యాలన్నారు. అదనపు రుణం మంజూరు చేసినా ప్రతి లబ్దిదారుడు తప్పనిసరిగా ఇంటి నిర్మాణం కోసమే ఆ మొత్తాలు ఖర్చు చేసి, ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. డేగలయ్య, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం వి ఎస్ ప్రియంవద, డిపిఎం, ఏ పి ఎం లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.