భూగర్భగనుల లీజు అనుమతులు కోరే దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ సంస్థ, రెవిన్యూ అధికారులు, లీజు దరఖాస్తుదారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన, పర్యావరణ, రెవెన్యూ , జిల్లా పరిపాలన, గనుల లీజు దారులకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. భూగర్భ గనుల లీజు అనుమతులు మంజూరైన వెంటనే క్వారీ పనులు ప్రారంభించాలన్నదే ప్రభుత్వ విధానమని అన్నారు. పనులు ప్రారంభించని పక్షంలో లీజు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా లీజు కొరకు దరఖాస్తు చేసుకునే వారికి సులువుగా అర్థమయ్యేటట్లు చార్ట్ తయారు చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సూచించారు.
దరఖాస్తుల అనుమతులకు ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ, అవసరమైన చోట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. అనంతరం ఇప్పటివరకు క్వారీ లీజు మంజూరైన ఏ కారణంతో మొదలు కాలేదు, ఉన్న సమస్యలపై క్వారీ లీజు దారులు, అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.హేమ లత, గనుల శాఖ ఉప సంచాలకులు ఎమ్ . బాలాజీ నాయక్, సహాయ సంచాలకులు ఎస్.పి.కె.మల్లేశ్వర రావు, భూగర్భ గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్యామ్ పీటర్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ జూనియర్ ఇంజనీర్ వీణా లహరి, తదితరులు, పాల్గొన్నారు.